విశాఖ వైసీపీలో హీట్.. ఎంపీ విజయసాయి టార్గెట్‌గా ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
రాజ్యసభ్య సభ్యులతో జగన్ సీఎం కాలేరు. ఎమ్మెల్యేలు గెలవాల్సి ఉంటుందని వాసుపల్లి గణేష్ చేసిన వ్యాఖ్యలు హీట్ రాజేస్తున్నాయి.
విశాఖ రాజకీయాలు హాట్‌హాట్‌గా మారుతున్నాయి. అధికార వైసీపీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. జగన్ సర్కార్‌కి మద్దతు పలికిన టీడీపీ ఎమ్మెల్యే నేరుగా విజయసాయి టార్గెట్‌గా విమర్శలు గుప్పించడం హాట్‌టాపిక్‌గా మారింది. విశాఖ సౌత్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన వాసుపల్లి గణేష్ అనంతరం వైసీపీకి మద్దతు పలికారు. అధికారికంగా పార్టీలో చేరకపోయినప్పటికీ ఆయన జగన్ సర్కార్‌కి జై కొట్టారు.
అంతవరకూ బాగానే ఉన్నా ఆయన పార్టీలో ఇమడలేకపోతున్నారన్న టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యే వ్యాఖ్యలు కూడా అందుకు బలం చేకూరుస్తున్నాయి. తాజాగా వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి టార్గెట్‌గా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ సభ్యుల వల్ల వైఎస్ జగన్ సీఎం కాలేరని.. ఎమ్మెల్యేలు గెలవాల్సి ఉంటుందని వాసుపల్లి గణేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిన్నమొన్నటి వరకూ ఉత్తరాంధ్ర వైసీపీ కన్వీనర్‌గా పనిచేసిన విజయసాయి రెడ్డికి ఆ విషయం ఎందుకు అర్థం కాలేదో తెలియదంటూ బాహాటంగానే విమర్శలు గుప్పించారు.
కొత్త కన్వీనర్‌గా వచ్చిన సీనియర్ నేత, జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి అయినా సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. నేరుగా విజయసాయినే టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం ఆసక్తికర చర్చకు దారితీసింది. విశాఖకు చెందిన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్‌తో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కి అస్సలు పొసగడం లేదన్న వాదనలున్నాయి. ప్రత్యర్థి సీతంరాజుకి విజయసాయి రెడ్డి అండదండలు ఉన్నాయని.. ఆయన పేరు చెప్పుకుని సీతంరాజు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ బహిరంగంగా తన అక్కసును వెళ్లగక్కడం చర్చనీయాంశంగా మారింది.