Fri Nov 22 2024 18:51:28 GMT+0000 (Coordinated Universal Time)
మణిపూర్ ఘోసకు చెవిటి భారతం
మతోన్మాదం, కులోన్మాదంతో భగ్గుమంటున్న మణిపూర్ మంటలు ఆర్పడానికి ఏ ఒక్క రాష్ట్రం కూడా స్వచ్ఛందంగా ఎందుకు..
ఎక్కడో ఉక్రెయిన్‌లో బాంబులు పడితే ఇక్కడ ర్యాలీలు తీస్తారు. ఎక్కడో అమెరికాలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే భారత్ మొత్తం బందుకు పిలుపునిస్తారు. రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసినందుకు యావత్ దేశం భగ్గుమంటుంది. కేవలం సెలెక్టివ్ ఔట్రేజ్లకే దేశం దద్దరిల్లుతుందా? ఏదో దేశంలో జరిగితేనే మనదేశంలో ప్రజలు రోడ్లమీదకు వస్తారా? క్యాండిల్ ర్యాలీలూ, రాస్తారోకోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హీరోలు అనిపించుకుంటారా? కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలలకు బందులు, ధర్నాలు, దిష్టిబొమ్మ దహన కార్యక్రమాలు చేపట్టే రాజకీయ నాయకులు.. కేవలం రాజకీయ లబ్ది ఉంటేనే అజిటేషన్లకు పాల్పడతారా? మన దేశంలో రోజుల తరబడి ఒక రాష్ట్రం రావణకాష్టలా తగలబడుతుంటే ఏమీ పట్టనట్టు చోద్యం చూస్తారా?
మతోన్మాదం, కులోన్మాదంతో భగ్గుమంటున్న మణిపూర్ మంటలు ఆర్పడానికి ఏ ఒక్క రాష్ట్రం కూడా స్వచ్ఛందంగా ఎందుకు పోరాడటం లేదు? ఉక్రెయిన్‌లో, బంగ్లాదేశ్‌లో ఇంకెక్కడో ఎవరికో ఏదో జరిగితే ట్వీట్లు చేస్తూ ఇక్కడ వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే నేతలు.. మణిపూర్ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు. దాదాపు వందరోజులుగా తగలబడుతున్న మన దేశంలోని ఓ భాగం పై వివిధ రాష్ట్రాలకు ఎందుకంత వివక్ష? మణిపూర్ మనది కాదా? స్వచ్ఛందంగా ప్రజలు, నేతలు ఏకమై పరిష్కారం కోసం ఉద్యమం చేయలేమా?
26 ప్రతిపక్షాల ఇండియా కూటమి.. 36 పక్షాల ఎన్టీయే పై నిరసన వ్యక్తం చేయడానికి పార్లమెంట్లో మణిపూర్ వివాదాన్ని లేవనెత్తాయి. పార్లమెంట్ సెషన్ మొదలైన కొద్దిసేపటికే సభ వాయిదా పడింది. ఇలా చేస్తే మణిపూర్‌కు న్యాయం జరుగుతుందా? వర్షాకాల సమావేశాలు జరిగినన్నాళ్ళూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కానీ.. ఇంత రాద్దాంతం నడుమ పార్లమెంట్లో నాలుగు బిల్స్ పాస్ అయ్యాయి. వాటికి ఉన్న ప్రాధాన్యత మణిపూర్ ఘోసకు లేదా అని అడిగేవాళ్ళు కూడా కరువయ్యారు.
కొందరు మూర్ఖుల విద్వేషాలకు వేలాది కుకీలు, మెయితీలూ ఇళ్ళు వాకిళ్ళను కోల్పోయి రోడ్డున పడ్డారు. ఆడవాళ్ళు, పిల్లలు భయం గుప్పెట్లో ఒణికిపోతున్నారు. దశాబ్దాలుగా కలిసి కాపురాలు చేస్తున్న ఇరు తెగలవాళ్ళు ఇప్పుడు నెలకొన్న రాద్దాంతంలో బలిపశువుల్లా ప్రాణాలు కోల్పోతున్నారు. అర్థరహిత పోరాటంలో ఆటవిక నాగరికతకు లోబడుతున్నారు. పట్టించుకోవాల్సిన ప్రభుత్వాలు, యంత్రాంగాలూ తోలుబొమ్మలాట చూస్తున్న మాదిరి మిగిలిపోయారు. యుద్ధాన్ని ఆపలేని అశక్తుల మాదిరి అధికారులు, న్యాయవ్యవస్థలూ ఉన్నట్టు కనిపిస్తున్నాయి.
కేంద్ర పథకాలు, మోడీ వైఫల్యాలను ఎండగట్టే మమతా బెనర్జీ, నితిష్ కుమార్, అర్వింద్ కేజ్రీవాల్, కేసీఆర్, అఖిలేష్ యాదవ్, మాయావతి, స్టాలిన్, పినరయ్ విజయన్లు మణిపూర్ విషయంలో తమ రాష్ట్రం తరఫున పూర్తిస్థాయి మద్దతు ఎందుకు తెలుపడం లేదు? మణిపూర్‌లో మేయితీ, కుకీల నడుమ జరుగుతున్న యుద్ధంలో ఎప్పుడో రెండు నెలల క్రితం జరిగిన ఓ వీడియోను ఉద్దేశించి జరిగిన అజిటేషన్.. నాలుగు రోజుల తర్వాత చల్లబడిపోయింది. అక్కడ ప్రతిరోజూ అలాంటి మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ చెప్పారు. ఊహకు కూడా అందనంత ఘోరంగా మణిపూర్ విధ్వంసం జరుగుతుంటే దేశం మాత్రం తూతూ మంత్రంగా హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్‌కు పరిమితమైంది. ఏ ఒక్క రాష్ట్రం కూడా మణిపూర్ కోసం పూర్తిస్థాయి మద్దతును తెలుపలేకపోతోంది. వేరే దేశంలో జరిగే ఏ ఘోరం పైనన్నా అహర్నిశలు నిరసనలు తెలిపే భారతీయులు సొంత భూమిలో భాగమైన మణిపూర్ విషయంలో చోద్యం చూస్తూ మిన్నకుండిపోతున్నారు.
నెలల తరబడి ఓ రాష్ట్రం అనాగరిక రీతిలో ధ్వంసం అవుతుంటే ఏకతాటిపై కేంద్ర మీద కానీ, సంబంధిత శాఖల మీద కానీ ఉద్యమం చేయలేకపోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇద్దరు ఆడవాళ్ళ పై మెయితీలు జరిపిన అఘాయిత్యానికి ఓ రెండు నిమిషాల ప్రసంగం చదివి నిందితులని శిక్ష పడేలా చూస్తామని చెప్పారు. అది జరిగి వారం కావొస్తున్నా.. మణిపూర్ వివాదానికి ఏం పరిష్కారం చూపారో తెలియరాలేదు. సేవ్ మణిపూర్ అంటూ అక్కడక్కడా బోర్డ్‌లు కనిపిస్తున్నాయే తప్ప.. భారతీయులందరూ ఏకమై గళమెత్తడం లేదు.
ఈ భూమి మీద పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. ప్రజలందరూ ఒకటైతే దేశగతినే మార్చవచ్చు, ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తే ఏ మూలనా ఇలాంటి అరాచకాలు జరగవు. అధికారంలో ఉంటూ జరుగుతున్న అనర్ధాలకు ప్రతిపక్షాల కుట్ర కారణమంటూ పేర్కొనడం చేతకాని తనం అనిపిస్తుందే తప్ప.. మరొకటి కాదు. స్వలాభాల కోసం ప్రభుత్వాలు, లాపర్వాగా ఉండే సమాజం అధోగతి వైపు పయనిస్తాయే తప్ప అభివృద్ధి బాటను ఎన్నటికీ చేరుకోలేవు.
(Views, thoughts, and opinions expressed in this newsstory/article belong solely to the ఔథొర్)
Next Story