Fri Nov 22 2024 23:16:08 GMT+0000 (Coordinated Universal Time)
Ap Politics : ఎన్నికల్లో కాపు ఓటర్లు దారి అటువైపైనా...? వారే తమ నేత అని డిసైడ్ అయ్యారా?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కాపు సామాజికవర్గం ఓటర్లు పవన్ వైపు ఉంటారా? ముద్రగడ వైపు మొగ్గు చూపుతారా? అన్నది ఆసక్తికరం
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా జరగనున్నాయి. జనం నాడి పెద్దగా అందడం లేదు. ఎవరికి వారే తమదే గెలుపునన్న ధీమాతో ఉన్నారు. పొత్తులతో టీడీపీ ముందుకు వస్తుండగా, ఒంటరిగా వైసీపీ ఎన్నికలకు నేతలను, శ్రేణులను సమాయత్తం చేస్తుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కాంబో సూపర్ సక్సెస్ అవుతుందని అంచనా వేస్తుండగా, సంక్షేమ పధకాలు తమను మరోసారి అధికారంలోకి తెస్తాయని వైసీీపీ గట్టిగా నమ్ముతుంది. ఇరు పార్టీలదీ బలమైన విశ్వాసం. ఈసారి గెలుపు తమదేనన్న ధీమా. కానీ ఈసారి కాపులు ఎటువైపు అన్నది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అత్యధిక ఓట్లున్న కాపు సామాజికవర్గం ఈ ఎన్నికల్లో ఎటు వైపు మొగ్గు చూపుతాయన్నది ఆసక్తికరమే. ప్రతి ఒక్కరూ కాపు ఓట్ల గురించే చర్చించుకుంటున్నారు.
బ్రాండ్ అంబాసిడర్గా...
అందుకు ప్రత్యేకంగా కారణాల గురించి చెప్పాల్సిన పనిలేదు. పవన్ కల్యాణ్ ను తమ జాతి నేతగా గుర్తిస్తారా? తమ జాతి కోసం కొన్ని దశాబ్దాలుగా శ్రమిస్తున్న ముద్రగడ వెనక నడుస్తారా? అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. అయితే ఇందులో ఎవరిది పై చేయి అన్నది ఫలితాల తర్వాత మాత్రమే తెలియనున్నప్పటికీ కాపుల మద్దతుపైనే జయాపజయాలు ఎక్కువగా ఆధారపడి ఉన్నాయన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సొంతంగా పోటీ చేయడం లేదు. 24 స్థానాలకు మాత్రమే తన పార్టీని పరిమితం చేసుకున్నారు. ఇది కొందరి కాపులకు రుచించడం లేదు. డిమాండ్ ఉన్నప్పుడు, మన అవసరం ఉన్నసమయంలో వెనక్కు తగ్గడమేంటని కాపు నేతలు పవన్ కల్యాణ్ ను సూటిగానే ప్రశ్నిస్తున్నారు. కానీ పవన్ మాత్రం తన లక్ష్యం జగన్ ను ఓడించడమేనని చెప్పుకొస్తూ ఆయన 99 శాతం స్ట్రయిక్ రేట్ కోసమే తాను సీట్లను తగ్గించుకున్నానని వివరణ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది. యువ కాపు ఓటర్లకు మాత్రం పవన్ తమ కులానికి బ్రాండ్ అంబాసిడర్ అని భావిస్తున్నారు.
కొన్నేళ్లుగా జాతి కోసం...
ఇక కాపు సామాజికవర్గం కోసం కొన్నేళ్లుగా శ్రమిస్తున్న మరో నేత ముద్రగడ పద్మనాభం. ఆయన కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తూనే ఉన్నారు. ఆయన నేటి రాజకీయ నేత కాదు. కొన్ని దశాబ్దాల నుంచి ఆయనకు పట్టున్న నేతగా పేరుంది. ఆయన చాలా కాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కాపు సమస్యల కోసమే పోరాడుతూ తమ జాతి కోసం తానున్నానంటూ ఆయన గట్టిగానే సంకేతాలు ఆ సామాజికవర్గానికి పంపారు. అయితే జనసేనలో చేరాలనుకున్నా ఆయన చేరికకు పవన్ నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. కిర్లంపూడి ఇంటికి వచ్చి కలుస్తానని చెప్పిన పవన్ కూడా రాకపోవడం, టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా సీట్లను ఖరారు చేయడంతో పెద్దాయన పద్మనాభం హర్ట్ అయినట్లే కనిపించింది. అందుకే ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 14న వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తాను జాతికి ఏనాడు ద్రోహం చేయలేదని, తనను నమ్మమంటూ కాపుసోదరులకు లేఖ కూడా రాశారు.
రెండు జనరేషన్లు...
దీంతో ఇప్పుడు పవన్ వర్సెస్ పద్మనాభం మధ్య కాపు ఓట్లు చీలనున్నాయన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. అవి ఎంత వరకూ చీలతాయన్నదే ప్రశ్న. కాపులు పవన్ ను నమ్ముతారా? పద్మనాభాన్ని విశ్విసిస్తారా? అయితే ఇక్కడ ఒకటి మాత్రం నిజం. కాపులలో రెండు జనరేషన్లు వేర్వేరు దారుల్లో పయనిస్తారన్న చర్చ కూడా ఉంది. కొత్త జనరేషన్ ను పవన్ వెంట ఉండే అవకాశాలున్నాయి. అదే సమయంలో ఓల్డ్ జనరేషన్ పద్మనాభాన్ని అనుసరించేందుకు కూడా ఛాన్స్ ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి కానప్పుడు పరోక్షంగా చంద్రబాబుకు ఎందుకు సహకరించాలన్న ఉద్దేశ్యంలో పాత జనరేషన్ ఉన్నారు. కానీ యువ కాపు ఓటర్లు మాత్రం పవన్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. దీంతో ఏపీ ఎన్నికల్లో ఇప్పుడు కిర్లంపూడి వర్సెస్ మొగల్తూరు మధ్య పోటీ రసవత్తరంగానే జరగనుంది.
Next Story