Fri Nov 22 2024 19:43:40 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జగన్ చూపంతా ఢిల్లీ వైపే.. అందుకు రీజన్ ఇదేనట
వైసీపీ అధినేత జగన్ పార్లమెంటు ఎన్నికలపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఎక్కువ స్థానాలను దక్కించుకునేలా ప్లాన్ చేస్తున్నారు
వైసీపీ అధినేత జగన్ పార్లమెంటు ఎన్నికలపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంటు సీట్లు కూడా అధిక సంఖ్యలో గెలుపొందేలా ప్లాన్ చేస్తున్నారు. కేవలం అసెంబ్లీ స్థానాలపైనే కాకుండా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కూడా ఆయన ప్రత్యేకంగా నివేదికలను తెప్పించుకుని గెలుపు గుర్రాలకే సీట్లు ఇచ్చేలా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన సరిపోదని, ఢిల్లీలో పట్టు సడలకుండా ఉండాలంటే పార్లమెంటు స్థానాలు కూడా అంతే ముఖ్యమని జగన్ భావిస్తున్నారు. అనేక కారణాలతో పార్లమెంటు స్థానాల్లోనూ అభ్యర్థులను మార్చేందుకు సిద్ధమవుతున్నారు.
అసెంబ్లీ స్థానాలే కాదు...
వచ్చే ఎన్నికల్లో గెలవడం పార్టీకి, తనకు ఎంత ముఖ్యమో.. పార్లమెంటు స్థానాలను కూడా అధిక స్థానాలను సంపాదించడం అంతే అవసరమన్న భావనలో ఉన్నారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పార్లమెంటు స్థానాలు ఎక్కువగా ఉంటే బిల్లుల ఆమోదానికి, అనేక అవసరాలకు తమపై ఆధారపడేలా ఉండాలన్నది జగన్ యోచన. అప్పుడే రాష్ట్రానికి అవసరమైన నిధులను తెచ్చుకోవడంలో గాని, పెండింగ్ సమస్యలను పరిష్కరించుకోవడం లోగాని తమకు కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆయన భావిస్తున్నారు. అందుకే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఆయన సమీక్షలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే మార్చేసి...
తొలి రెండు జాబితాల్లో హిందూపురం, అనంతపురం పార్లమెంటు స్థానాలను మార్చారు. హిందూపురం ప్రస్తుత ఎంపీ గోరంట్ల మాధవ్ ను తొలగించి, ఆయన స్థానంలో శాంతమ్మను ఇన్ఛార్జిగా నియమించారు. అనంతపురం పార్లమెంటు సభ్యుడు తలారి రంగయ్యను కల్యాణదుర్గానికి పంపి, మాజీ మంత్రి శంకర నారాయణను అనంతపురం పార్లమెంటు ఇన్ఛార్జిని చేశారు. కర్నూలు ఎంపీగా సంజీవ్ కుమార్ స్థానంలో మంత్రి గుమ్మనూరి జయరాంకు అవకాశం కల్పించారు. నెల్లూరు పార్లమెంటుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అభ్యర్ధిత్వం ఖరారయింది. నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలను తప్పించి ఆయనను గుంటూరు పార్లమెంటుకు పంపాలని భావిస్తున్నారు. అదే సమయంలో నరసరావుపేట పార్లమెంటుకు నాగార్జునయాదవ్ పేరును పరిశీలిస్తున్నారు.
మరికొన్ని మార్పులు...
విశాఖ పార్లమెంటు నియోజకవర్గానికి బొత్స ఝాన్సీ పేరు వినపడుతుంది. అలాగే విజయనగరం పార్లమెంటుకు బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను పేరును ఖరారు చేస్తారని చెబుతున్నారు. కడప పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డిని కూడా తప్పించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన స్థానంలో మైనారిటీ వర్గానికి సీటు ఇవ్వాలన్న యోచనలో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కు అసెంబ్లీ ఇన్ఛార్జిగా నియమించినందున ఆయన స్థానంలో మరొక బీసీకి ఇవ్వాలన్న యోచనలో ఉన్నారు. ఏలూరు పార్లమెంటు అభ్యర్థిని మార్చనున్నారు. అలాగే విశాఖ ఎంపీ సత్యనారాయణను అసెంబ్లీకి పోటీ చేయించాలన్న యోచనలో ఉన్నారు. కాకినాడ ఎంపీ వంగాగీతను పిఠాపురం ఇన్ఛార్జిగా నియమించారు. ఇప్పుడు కాకినాడ పార్లమెంటుకు ముద్రగడ కుటుంబ సభ్యుల పేరు వినిపిస్తుంది. మొత్తం బెజవాడలోనే కాదు.. ఢిల్లీలోనూ ఫ్యాన్ తిరిగేలా జగన్ తన నిర్ణయాలను తీసుకుంటున్నారు. మరి ఏ మేరకు ఫలితాలు వస్తాయన్నది చూడాలి.
Next Story