Mon Dec 23 2024 10:30:08 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : ముగ్గురు పీసీసీ చీఫ్ లు మారారు... షర్మిలను మార్చరన్న గ్యారంటీ ఉందా?
పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల ఈ నెల 21న బాధ్యతలను స్వీకరించబోతున్నారు. షర్మిలను కంటిన్యూ చేస్తారా? అన్న అనుమానమూ లేకపోలేదు
రక్తసంబంధం అనేది ఎవరూ కాదనలేనిది. ఒక ఇంట పుట్టిన వారికి ఆప్యాయతలు.. అనురాగాలు మనసులోనే ఉంటాయి. కొందరు బాహాటంగా బయటపెడతారు. మరికొందరు అవసరమైనప్పుడు తోబుట్టువుకు అండగా నిలబడేందుకు ప్రయత్నిస్తారు. అవి బయటపడే సమయంలోనే పడతాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో మరికొద్దిరోజుల్లో బ్లడ్ రిలేషన్స్ పాలిటిక్స్ లో హోరాహోరీ తలపడుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డలుగా ఎదిగిన ఆ ఇద్దరూ పొలిటికల్ ఫైట్ కు సిద్ధమవుతున్నారు. అయితే ఇందులో ఎవరిది పై చేయి అవుతుందన్నది ఇప్పుడే తెలియకున్నా వారు ఎంచుకున్న మార్గాలు మాత్రం విభిన్నం కావడంతోనే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
కుటుంబం కార్యక్రమం...
నిన్న రాత్రి హైదరాబాద్ లో తన చెల్లి వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థ వేడుకలకు ముఖ్యమంత్రి జగన్ దంపతులు హాజరయ్యారు. కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. వారికి పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. తర్వాత కుటుంబ సభ్యులతో కలసి జగన్ గ్రూప్ ఫొటో కూడా దిగారు. ఇదంతా కుటుంబ వ్యవహారమే. కుటుంబంలో జరిగే ఒక శుభకార్యానికి హాజరైన జగన్ ను సాదరంగా చెల్లెలు షర్మిల ఆహ్వానించారు. అలాగే జగన్ కూడా చెల్లి పిలిచిన వెంటనే కార్యక్రమానికి హాజరై వధూ వరులను ఆశీర్వదించి వెనువెంటనే విజయవాడ కు బయలుదేరి వెళ్లిపోయారు. అయితే దీనిపై కొందరు చిలువలు... పలువులు చేయవచ్చు. రక్త సంబంధం వేరు. రాజకీయం వేరు. ఎవరి దారులు వారివి.
ఎవరి దారి వారిదే...
ఒకరి దారిలో ఒకరు నడవాలంటే చిన్నప్పుడు అన్న చేయి పట్టుకుని నడిచే చెల్లి కాదు షర్మిల. అలాగే చిన్నప్పుడు తప్పటడుగు వేసే చెల్లెలను పట్టుకునే వయసు కూడా జగన్ ది కాదు. ఇద్దరూ రాజకీయంగా ఆరితేరిన వాళ్లే. సొంత పార్టీలు పెట్టుకుని తమ తండ్రి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అధికారంలోకి వద్దామనుకున్న వాళ్లే. కానీ ఏపీలో జగన్ మాత్రం సక్సెస్ కాగా, షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి చేయి కాల్చుకున్నారు. అంతే తేడా. ఎవరిపైనా మరొకరు పెత్తనం చేసే పరిస్థితి వారిలోనే కాదు.. ఎవరిలోనూ ఉండదు. ఏ కుటుంబంలో రాజకీయ వైరుధ్యాలు లేవు. ఎన్టీఆర్ కుటుంబంలో లేవా? మొన్నటి వరకూ దగ్గుబాటి, చంద్రబాబు బద్ధ శత్రువుల్లా వ్యవహరించలేదా? సోనియా గాంధీ, మేనకా గాంధీ వేర్వేరు దారుల్లో పయనించడం లేదా? అందరికీ వర్తించినట్లే వీరికీ వర్తిస్తాయి. కాకుంటే అధికారంలో ఉన్న నేత కావడంతో కాస్తంత ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.
జాతీయ పార్టీ కావడంతో...
ఈ నెల 21వ తేదీన వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ గా బాధ్యతలను స్వీకరించబోతున్నారు. జీరో ఉన్న పార్టీని ఒక స్థాయికి తేగలగాలి. ఆ ఆపరేషన్ ను సక్రమంగా నిర్వహిస్తే సరి. లేకుంటే షర్మిలను ఆ పార్టీ అధినాయకత్వం నిర్దాక్షిణ్యంగా పక్కన పెడుతుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఢిల్లీలో నిర్ణయాలు తీసుకునే ఆ పార్టీకి ఎలాంటి మొహమాటాలు ఉండవు. వారికి గెలుపు ముఖ్యం. పార్టీ పటిష్టత అవసనరం. ఇందుకు సమయం ఎంత అంటే.. ఇప్పుడే చెప్పలేకపోయినా.. ఒకసారి విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ హిస్టరీని పరిశీలిస్తే ముగ్గురు పీసీీసీ చీఫ్ లు మారారు. రఘువీరారెడ్డి, సాకే శైలజానాధ్, గిడుగు రుద్రరాజు.. తర్వాత షర్మిల.. మరి షర్మిల తర్వాత.. ఎవరో ఒకరు ఉండే ఉంటారు. రారన్న గ్యారంటీ మాత్రం ఏమీ లేదు. అది ఆమె గ్రహిస్తే మంచిదని కుటుంబంతో సన్నిహితంగా ఉన్నవారు సూచిస్తున్నారు. వినడం వినకపోవడం ఆమె ఇష్టమే అయినా.. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం మాత్రం కత్తిమీద సామే.
Next Story