Sat Nov 23 2024 01:26:28 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : గెలవాలంటే ఆ మాత్రం రిస్క్ తప్పనిసరంటున్న జగన్
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని వైసీపీ అధినేత జగన్ అన్ని రకాలుగా వ్యూహాలు రచిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని వైసీపీ అధినేత జగన్ అన్ని రకాలుగా వ్యూహాలు రచిస్తున్నారు. కేవలం సంక్షేమ పథకాలను నమ్ముకుంటేనే మాత్రం సరిపోదన్నది ఆయనకు తెలియంది కాదు. సంక్షేమం ఒక్కటే తనను వచ్చే ఎన్నికల్లో గట్టెక్కించదని భావించిన తెలిసిన జగన్ అనేక రకాలుగా గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. సంక్షేమంతో రాష్ట్రంలో తన కంటూ ఒక ఓటు బ్యాంకును ఏర్పరచుకున్నారు. అభ్యర్థి ఎవరైనా పార్టీ గుర్తుపైనే ఓటు వేసేలా కొన్ని ఓట్లను గంప గుత్తగా సొంతం చేసుకున్నానన్న భావనలో ఉన్నారు. ఆ ఓట్లు ఏ పార్టీకీ బదిలీ కావన్న ఆత్మవిశ్వాసం వైసీపీ అధినేత జగన్ లో అడుగడుగునా కనిపిస్తుంది.
అభ్యర్థుల మీద వ్యతిరేకతతో...
అయితే అభ్యర్థుల మీద వ్యతిరేకత మాత్రం అంత తేలిగ్గా తీసిపారేయలేం. దీంతో పాటు నేతల మధ్య విభేదాలను కూడా పూర్తిగా తొలగించలేని పరిస్థితి. అలాగని తమను నమ్ముకున్న నేతలను వదులుకునేందుకు కూడా జగన్ సిద్ధంగా లేరు. తన వెంట నడిచిన వారికి సీట్లు కేటయీస్తూనే రెండోసారి గెలవాలన్న లక్ష్యంతో ఉన్నారు. ముఖ్యంగా ఎస్సీ నియోజకవర్గాల్లో ఇది స్పష్టంగా కనపడుతుంది. గత ఎన్నికల్లో ఎస్సీ,ఎస్టీ నియోజకవర్గాలన్నింటిలో వైసీపీ జెండా ఎగరింది. ఫ్యాన్ గాలి బలంగా వీయడంతో పాటు అప్పడు అధికారంలో లేకపోవడంతో అందరూ కలసి పనిచేశారు. కానీ ఈసారి అలా కాదు. అధికారంలో ఉండటంతో ఐదేళ్ల నుంచి నేతల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎస్సీ నియోజకవర్గాలతో పాటు జనరల్ నియోజకవర్గాల్లోనూ నేతల మధ్య విభేదాలు బాగానే ఉన్నాయి.
ఎస్సీ నియోజకవర్గాల్లో...
అందుకోసమే ఎస్సీ నియోజకవర్గాల్లోని ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని నిర్ణయించినట్లు తెలిసింది. తనకు అందిన సర్వేల నివేదిక ప్రకారం కొన్ని సీట్లలో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉండటంతో పాటు లోకల్ లీడర్స్ కూడా వారి పక్షాన నిలబడటం లేదు. అలాంటి వారిని వేరే నియోజకవర్గాలకు మార్చాలని జగన్ నిర్ణయించినట్లు సమాచారం. అందువల్ల ప్రజల్లోనే కాకుండా నియోజకవర్గాల్లో రెడ్డి సామాజికవర్గం నేతల్లో ఉన్న అసంతృప్తి కూడా తొలగిపోతుందని భావిస్తున్నారు. వారికి టిక్కెట్లు ఇవ్వలేదన్న అపవాదు రాకుండా కూడా ఉంటుంది. అంతే కాకుండా ఎస్సీ సామాజికవర్గంలో పట్టున్న నేతలు కావడంతో వారిని వదులుకోవడమూ జగన్ కు ఇష్టం లేదు. వారితో పాటు మిగిలిన నియోజకవర్గాలకూ ఇదే సూత్రం వర్తించేలా జగన్ నిర్ణయం తీసుకున్నారు.
వీరందరికీ స్థానచలనం...
పత్తిపాడు - బాలసాని కిషోర్ , కొండేపి - ఆదిమూలం సురేష్, చిలకలూరిపేట - రాజేష్ నాయుడు, గుంటూరు పశ్చిమ - విడదల రజని, తాడికొండ - సుచరిత, వేమూరు - వరికూటి అశోక్‌బాబు, సంతనూతలపాడు - మేరుగ నాగార్జున, మంగళగిరి - గంజి చిరంజీవి, అద్దంకి - పాణెం హనిమిరెడ్డి, గాజువాక - రామచంద్రరావు, రేపల్లె - గణేష్‌లను ఇన్‌ఛార్జులుగా నియమించారు. నియోజకవర్గాల్లో నేతల మధ్య నెలకొన్న విభేదాలను సమసి పోవడమే కాకుండా కొత్త నేతకు అందరూ స్వాగతం పలుకుతారని, గెలుపు సులువవుతుందన్న అంచనాలో వైసీపీ అధినేత జగన్ ఉన్నారు. మరి ఈ ప్లాన్ ఏ మేరకు పనిచేస్తుందన్నది చూడాల్సి ఉంది. ఎక్కడా గెలిచే అవకాశం లేదని భావించిన వారిని పక్కన పెట్టనున్నారు.
Next Story