Mon Nov 25 2024 01:27:53 GMT+0000 (Coordinated Universal Time)
అదే మైనస్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నాలుగేళ్ల నుంచి నిర్విరామంగా జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే ఉంది
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నాలుగేళ్ల నుంచి నిర్విరామంగా జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే ఉంది. అయినా అధికార పార్టీపై ఎంతో కొంత అసంతృప్తి ఉండక మానదు. కరోనా క్లిష్ట సమయంలో రెండేళ్లు కూడా జగన్ వెల్ఫేర్ స్కీంలను మాత్రం ఆపలేదు. ఇది తమకు కలసి వచ్చే అంశంగా వైసీపీ భావిస్తుంది. అందులో కొంత నిజముంది కూడా. లబ్దిదారుల్లో అధికమంది తిరిగి ఫ్యాన్ పార్టీ వైపు చూస్తారనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. అయితే కొత్తగా జనసేన, టీడీపీ పొత్తుతో వైసీపీ గతంలో సాధించిన స్థానాలను మాత్రం దక్కించుకోవడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. బలమైన స్థానాలను రానున్న ఎన్నికల్లో వైసీపీ కోల్పోయే అవకాశాలున్నాయన్నది కూడా అంతే స్పష్టం. ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతో పాటు ఓటర్ల అభిప్రాయాలు కూడా మార్పు రావడంతో కొన్ని చోట్ల ఫ్యాన్ పార్టీకి రాజకీయంగా ఇబ్బందులు తప్పవంటున్నారు.
గ్రామీణ ప్రాంంతంలో…
వైసీపీకి తొలి నుంచి గ్రామీణ ప్రాంతల్లో పట్టుంది. ఇప్పటికీ ఆ పట్టు సడలలేదు. రూరల్ నియోజకవర్గాల్లో వైసీపీని ఢీకొట్టడం జనసేన, టీడీపీ కలసినా సాధ్యం కాదన్న విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంతో పాటు గ్రామ సచివాలయాలు, వాలంటరీ వ్యవస్థ, ఫ్యామిలీ డాక్టర్ వంటివి రూరల్ ఏరియాలో ఫ్యాన్ పార్టీకి అండగా నిలవనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా జగన్ కు అండగా నిలబడే అవకాశాలున్నాయి. రైతుల నుంచి సామాన్యుల వరకూ జగన్ అందించే పథకాలు, కార్యక్రమాలతో హ్యాపీగానే ఉన్నారన్నది వివిధ సర్వేలు అందిస్తున్న ప్రకారం ఇప్పటికే స్పష్టమయింది.
అర్బన్ ఏరియాలో…
కానీ అదే సమయంలో అర్బన్ ప్రాంతాల్లో మాత్రం వైసీపీ బాగా వీక్ గా ఉందన్నది కూడా అంతే వాస్తవం. ఒప్పుకుని తీరాల్సిందే. రాష్ట్రంలోని 32 అర్బన్ నియోజకవర్గాల్లో వైసీపీకి ఈసారి గెలుపు అంత సులువు కాదన్నది కూడా అంతే నిజం. మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులతో పాటు ఇక్కడ యువత కూడా ఎక్కువగా ఉండటంతో కొంత మైనస్ కనపడుతుందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో వన్ సైడ్ విక్టరీని సాధించిన వైసీపీకి సాధారణ ఎన్నికల్లో మాత్రం అర్బన్ ప్రాంతం మాత్రం దెబ్బకొట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు. ఈ విషయాన్ని వైసీపీ నేతలే ఆఫ్ ది రికార్డ్ గా అంగీకరిస్తున్నారు.
ముఖ్యనేతలు…
ఈ 32 నియోజకవర్గాల్లో ముఖ్యమైన నేతలే ఉన్నారు. పట్టణాలు, నగరాల్లో వైసీపీ బలహీనంగా ఉందన్న సర్వే నివేదికలు వైసీపీ అధినేతను కూడా కొంత కలవరపెడుతున్నాయంటున్నారు. ఇంకా ఎన్నికలకు సమయం ఉండటంతో అర్బన్ ప్రాంతంపై ఫోకస్ పెంచాలని పార్టీ సీనియర్ నేతలు కోరుతున్నారు. కార్పొరేషన్ల పరిధిలో అభివృద్ధి పనులు జరగకపోవడం, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. అందుకే రానున్న కాలంలో వైఎస జగన్ అర్బన్ ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టే అవకాశముందని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. జిల్లాల సంఖ్య పెంచినా వైసీపీకి అనుకున్నంత మైలేజీ రాలేదు. మధ్యతరగతి ప్రజలతో పాటు ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని తొలగించుకోగలిగితే ప్రస్తుత పరిస్థితుల నుంచి బయటపడతారన్నది పార్టీ సీనియర్ నేతల అభిప్రాయం కూడా. మరి జగన్ ఆ దిశగా చర్యలు తీసుకుంటారేమోనని ఎదురు చూస్తున్నారు లీడర్లు.
Next Story