Sat Dec 21 2024 13:55:33 GMT+0000 (Coordinated Universal Time)
హమ్మయ్య.. గెలిచి ఫైనల్కు
శ్రీలంకపై భారత్ జట్టు గెలిచేందుకు శ్రమించింది. 41 పరుగుల తేడాతో ఓడించి ఆసియా కప్ పైనల్ కు చేరుకుంది
శ్రీలంకపై భారత్ జట్టు గెలిచేందుకు శ్రమించింది. పాకిస్థాన్ పై సాధించిన విజయంతో ఊపు మీదున్న టీం ఇండియా శ్రీలంకను కూడా సునాయాసంగా ఓడించాలని భావించింది. అందుకే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఆదిలోనే దెబ్బతగిలింది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ మినహా ఎవరూ పెద్దగా చెప్పుకోదగ్గ స్కోరు లేకపోయారు. శ్రీలంక స్పిన్నర్ల ధాటికి భారత్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. అందుకే తక్కువ పరుగులకే అవుట్ అయింది. కేవలం 213 పరుగులకే పరిమితమయింది.
తక్కువ పరుగులకే...
వన్డేల్లో 213 పరుగులంటే పెద్ద టార్గెట్ కాదు. అందునా హోంపిచ్ మీద ఆడుతున్న శ్రీలంకతో కావడంతో భారత్ అభిమానుల ఆశలు అడుగంటాయి. తొలి ఓవర్లలో ముగ్గురిని పెవిలియన్ కు పంపించినా తర్వాత శ్రీలంక ఆటగాళ్లు కుదురుకోవడంతో భారత్ కు ఒక దశలో ఓటమి తప్పదని అనిపించింది. ఓవర్లు ఎక్కువగా ఉండటం కావాల్సిన పరుగులు తక్కువగా ఉండటంతో శ్రీలంక గెలుపు తథ్యమని భావించారు. శ్రీలంక జట్టులోనూ అదే ధీమా కనిపించింది. భారత్ క్రికెటర్లు నిరాశతో మైదానంలో పోరాడారు.
కులదీప్...
అయితే అప్పటికే ఆరు వికెట్లు కోల్పోయిన శ్రీలంకను భారత్ స్పిన్నర్ కులదీప్ యాదవ్ చావుదెబ్బ తీశాడు. వరసగా వారిని పెవిలియన్ కు పంపించారు. దీంతో భారత్ విజయం ఖాయమయింది. కేవలం 172 పరుగులకే భారత్ శ్రీలంకను ఆల్ అవుట్ చేసింది. కులదీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీసి లంక బ్యాటర్ల వెన్ను విరిచాడు. 41 పరుగుల తేడాతో శ్రీలంకపై గెలిచిన భారత్ ఆసియా కప్ లో నేరుగా ఫైనల్ కు చేరుకుంది. బంగ్లాదేశ్ తో శుక్రవారం ఒక నామమాత్రపు మ్యాచ్ ను ఆడనుంది. శ్రీలంకపై విజయంతో భారత్ ఆసియా కప్ ఫైనల్కు చేరడంతో భారత్ అభిమానుల్లో ఆనందాలు వెల్లువెత్తాయి. టపాసులు పేల్చి పండగ చేసుకున్నారు.
Next Story