సంచలనం.. మహిళల టీ-10 లీగ్‌లో మెరుపు సెంచరీ..!
యూరోపియన్ మహిళల T10 లీగ్-2023లో ఎవరూ ఊహించని సంచలనం నమోదైంది.
యూరోపియన్ మహిళల T10 లీగ్-2023లో ఎవరూ ఊహించని సంచలనం నమోదైంది. ఆస్ట్రియాతో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ ఐరిస్ జ్విల్లింగ్ కేవలం 34 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో జ్విల్లింగ్ 11 సిక్స్‌లు, 5 ఫోర్ల సాయంతో అజేయంగా 102 పరుగులు చేసింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రీడాకారిణిగా నిలిచింది.
టీ10 క్రికెట్లో నెదర్లాండ్స్ కెప్టెన్ ఐరిస్ జ్విల్లింగ్ చరిత్ర సృష్టించింది. టీ10 లీగ్‌లో సెంచరీ సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. ఈ ఇన్నింగ్స్‌లో ఐరిస్ 36 బంతులు ఎదుర్కొంది. ఇద్దరు ఆస్ట్రియన్ బౌలర్లపై జ్విల్లింగ్ విరుచుకుపడింది. ఒక్కో ఓవర్లో 23-23 చొప్పున పరుగులు చేసింది. తద్వారా జ్విల్లింగ్ నెదర్లాండ్స్ కు భారీ స్కోరును అందించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 10 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 159 పరుగులు చేసింది. ఆస్ట్రియాకు 160 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్యాన్ని ఛేదనకు దిగిన ఆస్ట్రియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 59 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. నెదర్లాండ్స్ బౌలర్లలో డి లాంగే, రాబిన్ రిజ్కే, హన్నా తలో 2 వికెట్లు తీశారు. కార్లిన్ వాన్ ఒక వికెట్ దక్కించుకుంది. ఆస్ట్రియా ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్క బ్యాచ్మెన్ రెండంకెల స్కోరు చేసింది. మల్లికా మహదేవ మాత్రమే 30 పరుగులు చేసింది. నలుగురు ఆస్ట్రియా బ్యాట్స్‌మెన్ ఖాతా కూడా తెరవలేకపోయారు.
అంతకుముందు మ్యాచ్‌లో కూడా జ్విల్లింగ్ స్పెయిన్‌పై 30 బంతుల్లో 74 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. నెదర్లాండ్స్ కెప్టెన్ ఐరిస్ జ్విల్లింగ్ ఇప్పటి వరకు 9 వన్డేల్లో 92 పరుగులు, 47 టీ20 మ్యాచ్‌ల్లో 448 పరుగులు చేసింది. టీ20ల్లో రెండు హాఫ్ సెంచరీలు కూడా తన పేరిట ఉన్నాయి. ఆమె కుడిచేతి వాటం బౌలర్ కూడా.