Sat Nov 23 2024 07:28:50 GMT+0000 (Coordinated Universal Time)
వివాదంపై స్పందించిన ఆంధ్ర క్రికెట్ సంఘం.. చివరికి!!
హనుమ విహారి ఉదంతంపై ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్పందించింది
హనుమ విహారి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తీరు తనను ఎంతో వేధనకు గురి చేసిందని, తన ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసిందని ఆరోపించాడు. ఇకపై ఆంధ్రా క్రికెట్ జట్టుకు ఆడే ప్రసక్తే లేదని తెలిపాడు. జట్టులో 17వ సభ్యుడి పైన అరవడం కారణమే కెప్టెన్సీకి రాజీనామా చేయాలని అసోసియేషన్ డిమాండ్ చేసిందని తెలిపాడు. జట్టులో 17వ సభ్యుడు ఓ రాజకీయ నాయకుడు కుమారుడని చెప్పాడు.
హనుమ విహారి ఉదంతంపై ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్పందించింది. ఆంధ్రా క్రికెట్ సంఘం ఆటగాళ్లందరినీ సమానంగా చూస్తుందని.. సీనియారిటీ ఆధారంగా ఆటగాళ్లకు అనుకూలంగా వ్యవహరించడం గానీ, లేకపోతే వారికి ప్రాధాన్యత ఇవ్వడం గానీ జరగదని వివరణ ఇచ్చింది. బెంగాల్ తో రంజీ మ్యాచ్ సందర్భంగా ఓ ఆటగాడిని హనుమ విహారి అందరి ముందు వ్యక్తిగతంగా దూషించాడన్న విషయం మా దృష్టికి వచ్చింది. ఆ క్రికెటర్ ఆంధ్రా క్రికెట్ సంఘానికి ఫిర్యాదు చేశాడు. 2024 జనవరిలో మొదటి రంజీ మ్యాచ్ ముగిశాక సీనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ నుంచి మాకు ఓ ఈమెయిల్ వచ్చింది. జాతీయ బాధ్యతల నేపథ్యంలో సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండలేనంటూ విహారి తెలుపడంతో అతడి స్థానంలో కొత్త కెప్టెన్ ను ప్రతిపాదిస్తూ పంపిన ఈమెయిల్ అది. సీనియర్ బ్యాట్స్ మన్ రికీ భుయ్ ని కొత్త కెప్టెన్ గా నియమిస్తున్నట్టు సెలెక్షన్ కమిటీ తెలిపింది. ఈ నిర్ణయం పట్ల హనుమ విహారి కూడా హర్షం వ్యక్తం చేశాడు. క్రికెటర్ ను దూషించిన వ్యవహారంలో హనుమ విహారి అసభ్యకరమైన భాష ఉపయోగించినట్టు జట్టులోని ఇతర ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, ఆంధ్రా క్రికెట్ సంఘం అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. అంతకుముందు కూడా, ముస్తాక్ అలీ టోర్నమెంట్ సమయంలో జట్టులో గ్రూపులు ఏర్పడ్డాయని ఆంధ్రా టీమ్ మేనేజర్ నివేదిక ఇచ్చాడు. హనుమ విహారి హైదరాబాద్ రంజీ టీమ్ నుంచి ఆంధ్రా టీమ్ కు మారాడు. అప్పటి నుంచి తరచుగా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అడుగుతుండేవాడు. తనకు ఇతర రాష్ట్రాల నుంచి ఆఫర్లు వస్తున్నాయని చెప్పేవాడు. ఎందుకో గానీ, ఉన్నట్టుండి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. హనుమ విహారి అనుభవం ఆంధ్రా రంజీ క్రికెట్ టీమ్ కు ఉపయోగపడుతుందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని, అతడు జట్టులో కొనసాగేందుకు ఆమోదం తెలిపాం. అన్ని ఫిర్యాదులపై క్షుణ్ణంగా విచారణ జరుపుతాం. ఎలాంటి చర్యలు తీసుకుంటామన్నది త్వరలోనే తెలియజేస్తామని ఆంధ్రా క్రికెట్ సంఘం ప్రకటనలో తెలిపింది.
Next Story