Mon Dec 23 2024 03:03:05 GMT+0000 (Coordinated Universal Time)
విరాట్ కోహ్లీ హోటల్ రూమ్ వీడియో లీక్.. అనుష్క శర్మ తీవ్ర ఆగ్రహం
అభిమాన ఆటగాళ్ల గురించి తెలుసుకోవడానికి అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటారు. ఇక విరాట్ కోహ్లీ లాంటి గ్లోబల్ స్టార్స్ విషయంలో అభిమానుల్లో చాలా క్యూరియాసిటీ దాగి ఉంటుంది. తాజాగా విరాట్ కోహ్లీ హోటల్ రూమ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విరాట్ కోహ్లీ డ్రెస్ లు, బ్యాగులు.. ఇలా అన్నిటికీ సంబంధించిన వీడియో లీక్ అయింది.
పెర్త్ లో సౌతాఫ్రికాతో మ్యాచ్ ఆడేందుకు కోహ్లీ వెళ్లగా హోటల్ రూమ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో లీకైంది. 'ఇదిగో.. ఇదే కింగ్ కోహ్లీ హోటల్ రూమ్..' అని వీడియో మీద రాసి ఉంది. ఈ వీడియోలో కోహ్లీ వాడే గ్లాసులు, క్యాప్, ఫోన్, వేసుకునే షూస్, టీమిండియా జెర్సీతో పాటు తన బట్టలు, కోహ్లీ వాడే న్యూట్రీషన్ పౌడర్ బాక్స్ లు, అతడు పడుకునే బెడ్, తదితర వస్తువులన్నీ వీడియో లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అయితే ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో కోహ్లీ కూడా ఆ వైరల్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి తీవ్ర విమర్శలు చేశారు. ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. 'అభిమానులు తమ అభిమాన ఆటగాడిని గురించిన వ్యక్తిగత విషయాలను తెలుసుకునేందుకు, వారికి కలిసేందుకు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఆ విషయంలో నేను వారిని అభినందిస్తాను కూడా. కానీ ఇక్కడ కనబడుతున్న వీడియో భయంకరగంగా ఉంది. ఇది నా గోప్యత (ప్రైవసీ) కు సంబంధించిన విషయం. నేను ఉండే హోటల్ రూమ్ లో కూడా గోప్యతను లేకపోతే ఇంకెక్కడ ఉండగలను..? ఈ రకమైన అభిమానాన్ని నేను ఏ మాత్రం ఎంకరేజ్ చేయను. దయచేసి ఇతరుల ప్రైవసీని గౌరవించండి. వారిని ఒక వినోద వస్తువుగా పరిగణించవద్దు..'అని చెప్పుకొచ్చాడు.
అనుష్క శర్మ కూడా విరాట్ కోహ్లీ హోటల్ వీడియో లీక్ అవ్వడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అనుష్క తన ఇన్స్టాగ్రామ్లో వీడియో స్క్రీన్షాట్ను పంచుకుంది. కొంతమంది అభిమానులు ఎంతో దారుణంగా ప్రవర్తిస్తున్నారంటూ చెప్పుకొచ్చింది. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని వెల్లడించింది అనుష్క.
Next Story