Mon Dec 23 2024 02:42:33 GMT+0000 (Coordinated Universal Time)
ఆసియా గేమ్స్: నేపాల్ తో తలపడనున్న టీమిండియా
టీ20 ఫార్మాట్లో జరుగుతున్న ఈ పోటీలో భారత జట్టుకు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వం వహించనున్నాడు
ఆసియా గేమ్స్ లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. టీమ్ ఈవెంట్స్ లో కూడా భారత ఆటగాళ్లు దూసుకుపోతున్నారు. ఇక క్రికెట్ అభిమానులు కూడా కొద్దిరోజుల పాటూ ఆసియా గేమ్స్ పై ఇంట్రెస్ట్ చూపించబోతున్నారు. ఎందుకంటే మెన్స్ టీమ్ పతకవేటను మొదలుపెట్టబోతోంది. ఇప్పటికే విమెన్స్ జట్టు గోల్డ్ ను సాధించగా.. ఇక మెన్స్ టీమ్ నేపాల్ తో క్వార్టర్ ఫైనల్ లో తలపడనుంది.
టీ20 ఫార్మాట్లో జరుగుతున్న ఈ పోటీలో భారత జట్టుకు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వం వహించనున్నాడు. పురుషుల ఈవెంట్లో ఐదు జట్లు - భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఐసీసీ ర్యాంకింగ్స్ కారణంగా నేరుగా క్వార్టర్-ఫైనల్ కు చేరుకున్నాయి. అన్ని మ్యాచ్లకు అధికారిక T20I హోదా ఉంది. నేపాల్, హాంకాంగ్, మలేషియా జట్లు క్వార్టర్ ఫైనల్ కు అర్హత సాధించాయి. ఆసియా క్రీడల్లో భారత జట్టుకు VVS లక్ష్మణ్ కోచ్ గా వ్యవహరిస్తున్నారు. ఆసియా క్రీడల్లో పాల్గొనడం భారత ఆటగాళ్లందరికీ గొప్ప అవకాశమని తెలిపారు.
క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ప్రత్యర్థి నేపాల్ గ్రూప్ దశలో మంగోలియా, మాల్దీవ్స్ జట్లను ఓడించి నాకౌట్ దశకు అర్హత సాధించింది. గత వారం మంగోలియాతో జరిగిన మొదటి గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో నేపాల్ బ్యాటర్లు మూడు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టారు. T20Iలలో 300 పైన పరుగులు చేసిన మొదటి జట్టుగా అవతరించింది. 19 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాటర్ కుశాల్ మల్లా 34 బంతుల్లోనే అత్యంత వేగవంతమైన T20I సెంచరీని నమోదు చేశాడు. డేవిడ్ మిల్లర్, రోహిత్ శర్మల పేరిట ఉన్న మునుపటి రికార్డు (35 బంతులు)ను అధిగమించాడు. మల్లా 12 సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో అజేయంగా 137 పరుగులు చేశాడు. నేపాల్ స్కోరు ఈ మ్యాచ్ లో 3 వికెట్ల నష్టానికి 314 చేరింది. నంబర్ 5 బ్యాటర్ దీపేంద్ర సింగ్ ఐరీ కూడా రికార్డు పుస్తకాలను తిరగరాశాడు. అతడు ఏకంగా తొమ్మిది బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్లో నేపాల్ 273 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక రెండో మ్యాచ్లో నేపాల్ 138 పరుగుల తేడాతో మాల్దీవ్స్ జట్టును ఓడించింది.
Next Story