WTC ఫైనల్: ఆస్ట్రేలియాకు ఊహించని షాక్
2 టెస్టుల్లో 7 వికెట్లు తీసిన మైకేల్ నేసర్, వన్డేల్లో 2 వికెట్లు పడగొట్టాడు. అయితే అతడికి మెయిన్ టీమ్ లోకి చోటు దక్కుతుందో లేదో చూడాలి.
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. జూన్ 7 నుంచి ఇంగ్లాండ్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్‌కి మూడు రోజుల ముందు ఆస్ట్రేలియాకి ఊహించని షాక్ తగిలింది. ఆసీస్ బౌలర్ జోష్ హజల్‌వుడ్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కి దూరమయ్యాడని తెలుస్తోంది. కొంతకాలంగా మోకాలు, మడమ గాయంతో బాధపడుతున్న జోష్ హజల్‌వుడ్, ఇండియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా ఆడలేదు. ఐపీఎల్ 2023 సీజన్లో కూడా చాలా మ్యాచులకు దూరంగా ఉన్న జోష్ హజల్‌వుడ్, మూడు మ్యాచులు ఆడి గాయం తిరగబెట్టడంతో జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టుకు కూడా హజల్ వుడ్ దూరమవుతున్నాడు. జోష్ హజల్‌వుడ్ గాయం నుంచి పూర్తిగా కోలుకుంటాడని, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆడతాడని ఆస్ట్రేలియా భావించింది. ఫైనల్ మ్యాచ్‌కి మూడు రోజుల ముందు నిర్వహించిన పరీక్షల్లో కూడా హజల్‌వుడ్ గాయం తగ్గకపోవడంతో అతడిని ఈ మ్యాచ్ కు దూరంగా ఉంచింది. జోష్ హజల్‌వుడ్ స్థానంలో ఆల్‌రౌండర్ మైకేల్ నేసర్‌ని స్టాండ్ బై ప్లేయర్ల లిస్టులో నుంచి తుది జట్టులోకి తీసుకుని వచ్చారు. 33 ఏళ్ల మైకేల్ నేసర్ ఇప్పటిదాకా ఆస్ట్రేలియా తరుపున 2 టెస్టులు, 2 వన్డేలు మాత్రమే ఆడాడు. 2 టెస్టుల్లో 7 వికెట్లు తీసిన మైకేల్ నేసర్, వన్డేల్లో 2 వికెట్లు పడగొట్టాడు. అయితే అతడికి మెయిన్ టీమ్ లోకి చోటు దక్కుతుందో లేదో చూడాలి.