Sat Nov 23 2024 03:43:05 GMT+0000 (Coordinated Universal Time)
టేబుల్ టాపర్ గా నిలిచిన న్యూజిలాండ్
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 245 పరుగులు చేసింది
వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ వరుసగా మూడో విజయం సాధించి.. టేబుల్ టాపర్ గా నిలిచింది. బంగ్లాదేశ్ తో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ ఏ మాత్రం తడబాటు లేకుండా విజయాన్ని అందుకుంది. బంగ్లాదేశ్ పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ ఓడిన బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేసి, నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 245 పరుగులు చేసింది. 246 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 42.5 ఓవర్లలో 2 వికెట్లకు ఛేదించింది.
కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్ తో ఎంట్రీ ఇచ్చాడు. 78 పరుగులు సాధించాడు. విలియమ్సన్ స్కోరులో 8 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. అయితే, ఎడమ చేయి బొటనవేలికి గాయం కావడంతో విలియమ్సన్ రిటైర్డ్ హర్ట్ గా మైదానాన్ని వీడాడు. డారిల్ మిచెల్ అద్భుతంగా ఆడి 67 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్ లతో 89 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. విలియమ్సన్ వెళ్ళాక వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ 11 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ తో 16 పరుగులు చేశాడు. ఓపెనర్ డెవాన్ కాన్వే 45 పరుగులు చేశాడు. రచిన్ రవీంద్ర (9) నిరాశపరిచాడు.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 245 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ముష్ఫికర్ రహీమ్ (66), కెప్టెన్ షకీబల్ హసన్ (40) రాణించగా... లోయరార్డర్ లో మహ్మదుల్లా (41 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మెహెదీ హసన్ మిరాజ్ 30 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఓపెనర్ లిట్టన్ దాస్ (0) డకౌట్ కాగా, యువ ఓపెనర్ టాంజిద్ హసన్ (16), నజ్ముల్ హుస్సేన్ శాంటో (7) విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో ఫెర్గుసన్ 3, ట్రెంట్ బౌల్ట్ 2, మాట్ హెన్రీ 2, మిచెల్ శాంట్నర్ 1, గ్లెన్ ఫిలిప్స్ 1 వికెట్ తీశారు.
Next Story