Mon Dec 23 2024 13:59:01 GMT+0000 (Coordinated Universal Time)
బంగ్లాదేశ్ ను దెబ్బతీసిన శ్రీలంక
ఆసియా కప్- 2023లో శ్రీలంక విజయం అందుకుంది. బంగ్లాదేశ్‌పై ఐదు వికెట్లతో గెలుపొందింది
ఆసియా కప్ లో శ్రీలంక విజయం అందుకుంది. బంగ్లాదేశ్‌పై ఐదు వికెట్లతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 42.4 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌట్ అయింది. శ్రీలంక 39 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. నాలుగు వికెట్లు తీసిన శ్రీలంక బౌలర్ మతీష పతిరానాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. శ్రీలంక బ్యాటర్లలో చరిత్ అసలంక (62 నాటౌట్: 92 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) అత్యధిక పరుగులు సాధించాడు. సదీర సమరవిక్రమ (54: 77 బంతుల్లో, ఆరు ఫోర్లు) అర్థ సెంచరీ సాధించాడు. బంగ్లా బౌలర్లలో షకీబ్ అల్ హసన్ రెండు వికెట్లు పడగొట్టాడు.
165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. స్కోరు బోర్డుపై 15 పరుగులు చేరేసరికి ఓపెనర్లు పతుం నిశ్శంక , దిముత్ కరుణరత్నే తక్కువ పరుగులకే పెవిలియన్ చేరుకున్నారు. వన్ డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు.సదీర సమరవిక్రమ (54: 77 బంతుల్లో, ఆరు ఫోర్లు), చరిత్ అసలంక (62 నాటౌట్: 92 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. హాఫ్ సెంచరీ అనంతరం సదీర సమరవిక్రమ అవుటైనా, కెప్టెన్ దసున్ షనకతో (14 నాటౌట్: 21 బంతుల్లో, ఒక ఫోర్) కలిసి అసలంక మ్యాచ్‌ను ముగించాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ అల్ హసన్‌కు రెండు వికెట్లు దక్కాయి. టస్కిన్ అహ్మద్, షోరిఫుల్ అస్లాం, మెహదీ హసన్ తలో వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు మహ్మద్ నయీమ్ (16), తన్జీద్ హుస్సేన్ (0) దారుణంగా విఫలం అయ్యారు. 25 పరుగులకే బంగ్లా రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (5) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. ఆ తర్వాత నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్ (20) ఇన్నింగ్స్‌ను కాస్త కుదుటపరిచారు. వీరు నాలుగో వికెట్‌కు 49 పరుగులు జోడించారు. ఒకానొక దశలో 127/4తో ఓ మోస్తరు స్కోరు సాధించేలా కనిపించింది బంగ్లా. అయితే తర్వాతి బ్యాటర్లు విఫలం కావడంతో 164 పరుగులకే ఆలౌట్ అయింది. కేవలం 37 పరుగుల తేడాలోనే ఆఖరి ఆరు వికెట్లను చేజార్చుకుంది. శ్రీలంక బౌలర్లలో మతీష పతిరానా అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. మహీష్ తీక్షణకు రెండు వికెట్లు దక్కాయి. ధనంజయ డి సిల్వ, దునిత్ వెల్లలాగే, దసున్ షనక తలో వికెట్ దక్కించుకున్నారు.
Next Story