బీసీసీఐకి తలనొప్పిగా మారిన పాకిస్థాన్ మ్యాచ్.. ఈ సారి హైద్రాబాద్‌లో..
ఐసీసీ వన్డే ప్రపంచ కప్-2023 ప్రారంభానికి రెండు నెలల కన్నా తక్కువ సమయం ఉంది.
ఐసీసీ వన్డే ప్రపంచ కప్-2023 ప్రారంభానికి రెండు నెలల కన్నా తక్కువ సమయం ఉంది. ఈసారి ప్రపంచకప్ భారత్ వేదికగా జరుగుతోంది. ఈసారి ప్రపంచకప్ షెడ్యూల్‌ను బీసీసీఐ, ఐసీసీ చాలా ఆలస్యంగా విడుదల చేశాయి. అయితే భద్రత, ఇతర కారణాల వల్ల షెడ్యూల్లో మార్పులు కూడా చేశారు. ఇప్పటికే భారత్-పాకిస్థాన్‌తో సహా 9 మ్యాచ్‌లు రీషెడ్యూల్ చేయబడ్డాయి.
ఇప్పుడు మరోసారి ప్రపంచకప్ షెడ్యూల్ విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేయడంతో బీసీసీఐ టెన్షన్ మళ్లీ పెరిగింది. షెడ్యూల్ మార్చాలని హెచ్‌సీఏ మరోసారి డిమాండ్ చేసింది. ఈసారి కూడా పాక్ మ్యాచ్‌లో మార్పు రావచ్చు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ) భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ)కి ప్రపంచ కప్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వడం కష్టంగా ఉందని తెలియజేసింది. అక్టోబర్ 9న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో న్యూజిలాండ్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరగనుండగా.. మరుసటి రోజు అదే మైదానంలో శ్రీలంక పాకిస్థాన్‌తో తలపడనుంది.
రెండు మ్యాచ్‌ల మధ్య గ్యాప్ లేకపోవడంతో హైదరాబాద్ పోలీసులు భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్థాన్-శ్రీలంక జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. ముందుగా అక్టోబర్ 12న మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 14కి రీషెడ్యూల్ చేయడంతో.. మ్యాచ్ డేట్ ముందుకు మార్చారు. తద్వారా పాక్ జట్టు సన్నద్ధతకు సమయం దొరికింది. టీమిండియా ఆస్ట్రేలియాతో అక్టోబర్ 8న చెన్నైలో ప్రారంభమ్యాచ్ ఆడనుంది. ఆగస్టు 25న వరల్డ్‌కప్ టిక్కెట్లు అధికారికంగా విక్రయించనున్నారు.