Mon Dec 23 2024 02:32:00 GMT+0000 (Coordinated Universal Time)
Team India భారత జట్టు పాకిస్థాన్ కు వెళ్లే అవకాశమే లేదు.. తేల్చేశారు
టీ20 ప్రపంచ కప్ ను కైవసం చేసుకున్న భారతజట్టు తర్వాతి టార్గెట్ ఛాంపియన్స్ ట్రోపీ
టీ20 ప్రపంచ కప్ ను కైవసం చేసుకున్న భారతజట్టు తర్వాతి టార్గెట్ ఛాంపియన్స్ ట్రోపీ. 2025లో పాకిస్థాన్ లో ఈ టోర్నీ జరగనుంది. అయితే ఈ టోర్నీ కోసం భారతజట్టు పాకిస్థాన్ లో కాలు పెట్టడం కుదరదని తాజాగా తేల్చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీని ఫిబ్రవరి-మార్చిలో హైబ్రిడ్ మోడల్లో నిర్వహించే అవకాశం ఉందని భారతజట్టు మ్యాచ్‌లు ఆడేందుకు పాకిస్థాన్‌కు వెళ్లే అవకాశం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్య హక్కులను పాకిస్థాన్ కలిగి ఉంది. దీంతో టోర్నమెంట్‌లోని కొన్ని మ్యాచ్‌లు UAE లేదా శ్రీలంకలో జరిగే అవకాశం ఉంది.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు గత నెలలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు టోర్నమెంట్ కు సంబంధించిన ముసాయిదా షెడ్యూల్‌ను సమర్పించింది. ముసాయిదా షెడ్యూల్లో.. మార్చి 1న చిరకాల ప్రత్యర్థుల మధ్య లాహోర్‌లో మ్యాచ్ జరగనుంది. అయితే, ప్రస్తుతానికి పాకిస్థాన్ ప్రయాణానికి సంబంధించినంత వరకు BCCI నుండి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. "ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టు పాకిస్తాన్‌కు వెళ్లడానికి అవకాశమే లేదు. దీనిపై ప్రభుత్వం ఫైనల్ గా నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతానికైతే టోర్నమెంట్ కు సంబంధించిన హైబ్రిడ్ మోడల్‌ను రూపొందిస్తున్నారు. భారతదేశం తమ మ్యాచ్‌లను యుఏఈ లేదా శ్రీలంకలో ఆడవచ్చు. ఆసియా కప్ లాగానే, ఛాంపియన్స్ ట్రోఫీ కూడా హైబ్రిడ్ మోడల్ లోనే భారత్ ఆడనుంది," అని సంబంధిత మూలం తెలిపింది.
2012-13 సీజన్ నుంచి భారత్ పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక క్రికెట్ ఆడలేదు. 2008 నుంచి భారత్ పాకిస్థాన్ పర్యటనకు వెళ్లలేదు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపే వరకు పాకిస్థాన్‌తో భారత్ ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించబోదని భారత ప్రభుత్వం ఇప్పటికే తేల్చి చెప్పింది.
Next Story