Fri Nov 22 2024 19:04:08 GMT+0000 (Coordinated Universal Time)
మిల్లర్ మాస్ ఫినిషింగ్.. ఫైనల్ కు చేరిన గుజరాత్ టైటాన్స్
మిల్లర్ మాస్ ఫినిషింగ్.. ఫైనల్ కు చేరిన గుజరాత్ టైటాన్స్
మిల్లర్ మాస్ ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో గుజరాత్ టైటాన్స్ ఈ ఏడాది ఐపీఎల్ ఫైనల్ కు చేరుకుంది. లీగ్ దశలో టాప్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన గుజరాత్ క్వాలిఫయర్ మ్యాచ్ లోనూ అదే తరహాలో విజృంభించి ఆడింది. బౌలర్లు పెద్దగా రాణించకపోయినప్పటికీ.. బ్యాటింగ్ లో మాత్రం నిలకడగా ఆడి ఫైనల్ కు చేరింది. ఈ సీజన్‌తో ఐపీఎల్లో అడుగుపెట్టిన కొత్త జట్టు అయినప్పటికీ.. టైటిల్ ను ఎగరేసుకుపోవడానికి ఒక్క అడుగు దూరంలో మాత్రమే నిలిచింది. రాజస్థాన్ రాయల్స్ కు ఇంకో అవకాశం ఉండడంతో క్వాలిఫయర్-2 లో ఎలా ఆడుతుందో చూడాలి. తొలి క్వాలిఫయర్ లో రాజస్థాన్ నిర్దేశించిన 189 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో మూడు బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి టైటాన్స్ విజయాన్ని అందుకుంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్ రాజస్థాన్ కు విజయాన్ని అందించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టులో బట్లర్ రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 188 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (3) తక్కువ స్కోర్ కే అవుట్ కాగా, బట్లర్ మరోసారి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. కొన్ని క్యాచ్ లను గుజరాత్ ఫీల్డర్లు జారవిడవడం అతడికి కలిసొచ్చింది. కెప్టెన్ సంజు శాంసన్ 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 47 పరుగులు చేయగా, దేవదత్ పడిక్కల్ 28 పరుగులు సాధించాడు. హెట్మెయర్ 4, పరాగ్ 4 పరుగులు చేసి అవుటయ్యారు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ, యశ్ దయాళ్, సాయి కిశోర్, హార్దిక్ పాండ్య ఒక్కో వికెట్ చొప్పున తీశారు.
ఛేజింగ్ లో ఖాతా కూడా తెరవకుండానే వృద్ధిమాన్ సాహా (0) అవుటయ్యాడు. మాథ్యూవేడ్, గిల్ కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఇద్దరూ కలిసి సమయోచితంగా ఆడుతూ మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలో 21 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 35 పరుగులు చేసిన గిల్ రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే 35 పరుగులు చేసిన వేడ్ కూడా అవుట్అయ్యాడు. మొదట నిదానంగా ఆడిన డేవిడ్ మిల్లర్ ఆ తర్వాత చెలరేగిపోయాడు. కెప్టెన్ పాండ్యా అతడికి అండగా నిలవడంతో మ్యాచ్ చివరి ఓవర్ దాకా వెళ్ళింది. చివరి ఓవర్లో గుజరాత్ విజయానికి 16 పరుగులు అవసరం కావడంతో ఉత్కంఠ నెలకొంది. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన తొలి బంతులను సిక్సర్లుగా మలచిన మిల్లర్.. మరో మూడు బంతులు మిగిలి ఉండగానే జట్టును ఫైనల్‌కు చేర్చాడు. 38 బంతులు ఎదుర్కొన్న మిల్లర్ 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. పాండ్యా 27 బంతుల్లో 5 ఫోర్లతో 40 పరుగులు చేశాడు.
గుజరాత్‌కు విజయాన్ని అందించిన డేవిడ్ మిల్లర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్‌లో ఓడినప్పటికీ రాజస్థాన్ ఇంకా ఫైనల్స్ రేసులోనే ఉంది. లక్నో సూపర్ జెయింట్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నేడు జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో రాజస్థాన్ జట్టు క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో తలపడుతుంది. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది.
News Summary - Miller magic carries Gujarat Titans to home IPL 2022 final
Next Story