Wed Apr 23 2025 17:30:37 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : ఓటమిని కొని తెచ్చుకున్న ఢిల్లీ కాపిటల్స్.. చివరకు ముంబయిదే విజయం
ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ కాపిటల్స్ ముంబయి్ ఇండియన్స్ పై ఓటమి పాలయింది.

ఐపీఎల్ మ్యాచ్ లో ఢిల్లీ కాపిటల్స్ తొలి ఓటమి చవి చూసింది. నిన్న ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ కాపిటల్స్ ముంబయి్ ఇండియన్స్ పై ఓటమి పాలయింది. అదీ కేవలం రనౌట్లతోనే వెనుదిరిగింది. సులువుగా గెలవగలిగిన మ్యాచ్ ను చేజేతులా చేజార్చుకుంది. చివరి ఒకటన్నర ఓవర్ లో కేవలం పదిహేను పరుగులు చేయాల్సి ఉండగా ఢిల్లీ కాపిటల్స్ జట్టు బ్యాటర్లు తీవ్ర వత్తిడికి గురయినట్లు కనిపించింది. ఒక్క పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయి చివరకు మ్యాచ్ ను సమర్పించుకున్నారు. దీంతో ఢిల్లీ కాపిటల్స్ భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఇప్పటి వరకూ ఐపీఎల్ 18 సీజన్ లో నాలుగు మ్యాచ్ లు ఆడి నాలుగింటిలో గెలిచిన ఢిల్లీ కాపిటల్స్ జట్టు తన సొంత గడ్డ పైన స్వయంకృతాపరాధంతో ఓటమిని కొని తెచ్చుకుంది.
ముంబయి మంచి స్కోరు చేసినా...
టాస్ గెలిచిన ఢిల్లీ కాపిటల్స్ జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే ఓపెనర్లుగా దిగిన రోహిత్ శర్మ, రికిల్ టన్ కదురుకున్నట్లుగానే కనిపించినా రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యూ గా వెనుదిరిగాడు. రోహిత్ 18 పరుగులకే అవుటయ్యాడు. రికిల్ టన్ 41 పరుగులు చేసి అర్ధ సెంచరీకి చేరువవుతునన దశలో కులదీప్ తన స్పిన్ మంత్రంతో అవుట్ చేశాడు. ఇక మన తెలుగోడు తిలక్ వర్మ వచ్చి జట్టుకు ప్రాణం పోశాడు. తిలక్ వర్మ సిక్సర్లు, ఫోర్లు బాదుతూ జట్టు స్కోరును పెంచుతూ తాను 59 పరుగులు చేశఆడు. నమన్ నాటౌట్ గా నిలిచి 38 పరుగులు చేశాడు. దీంతో ముంబయి ఇండియన్స్ ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి మొత్తం 205 పరుగులు చేసి ఢిల్లీకి ముందు మంచి లక్ష్యాన్ని ఉంచింది.
గెలిచే పరిస్థితి ఉన్నా...
అయితే ఢిల్లీ కాపిటల్స్ జట్టు ప్రస్తుతం ఉన్న ఫామ్ కు ఈ స్కోరు పెద్దగా సరిపోదని అందరూ అంచనా వేశారు. ఎందుకంటే ఎంతటి స్కోరును అయినా ఛేదనలో ఢిల్లీ కాపిటల్స జట్టు ఇప్పటి వరకూ చేజ్ చేసుకుంటూ వస్తుంది. జేక్ ఫ్రేజర్ డకౌట్ అయినా అభిషేక్ పోరెల్ 33 పరుగుల చేశాడు. కరుణ్ నాయర్ 89 పరుగులు చేసి ఢిల్లీ కాపిటల్స్ కు ఐదో విజయానికి చేరువ చేశాడు. అతను అవుట్ కావడంతో వచ్చిన కేఎల్ రాహుల్ 15 పరుగులకే అవుటయి వెనుదిరిగాడు. అక్షర్ పటేల్ తొమ్మిది పరుగుల చేసి అవుట్ కావడంతో ఇక స్టబ్స్ కూడా ఒక పరుగు చేసి ఉసూరమనిపించాడు. 9 బంతులకు పదిహేను పరుగులు చేయాల్సినమయంలో అశుతోష్ శర్మ, స్టార్క్, కులదీప్ యాదవ్ లు వరసగా ముగ్గురు రనౌట్ అయి ముంబయి ఇండియన్స్ కు విజయాన్ని అందించారు. 19 ఓవర్లలో ఆలౌల్ అయి 193 పరుగులను మాత్రమే ఢిల్లీ కాపిటల్స్ చేయగలిగింది.
Next Story