Wed Mar 26 2025 14:56:06 GMT+0000 (Coordinated Universal Time)
India Vs New Zeland Champions Trophy Finals : ఫైనల్ లో భారత్ జట్టులో మార్పులు అవసరమా?
ఇండియా - న్యూజిలాండ్ మధ్య రేపు దుబాయ్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్స్ మ్యాచ్ జరుగుతుంది.

ఇండియా - న్యూజిలాండ్ మధ్య రేపు దుబాయ్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్స్ మ్యాచ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభయ్యే ఈ మ్యాచ్ లో టాస్ కీలకమైనదని క్రీడా నిపుణులు చెబుతున్నా ఇప్పటి వరకూ టీం ఇండియా ఈ ట్రోఫీలో ఒక్కసారి కూడా టాస్ గెలవలేదు.అయినా ప్రత్యర్థిపై పై చేయి సాధించింది. టాస్ కు, గేమ్ కు సంబంధం లేదని కొందరు అంటున్నా.. కానీ పిచ్ ఎప్పటికప్పుడు తన స్వరూపాన్ని మార్చుకునే అవకాశముంది కాబట్టి టాస్ ను బట్టి ఫీల్డింగ్, బ్యాటింగ్ అనేది నిర్ణయించుకునే వీలుంది. యాభై ఓవర్ల ఆట కావడంతో సమయం గడిచే కొద్దీ పిచ్ తనరూపాన్నిమార్చుకునే వీలుంటుంది.
బౌలింగ్ లో...
ఇక భారత్ జట్టులో మార్పులు అవసరమని క్రీడానిపుణులు కూడా సూచిస్తున్నారు. బౌలింగ్ పరంగా స్వల్ప మార్పులు చేయడం మంచిదని సూచిస్తున్నారు. ముఖ్యంగా భారత్ ఇప్పటి వరకూ ఆడినట్లు ఎక్కువ మంది స్పిన్నర్లతో ఆడినా ఈసారి మాత్రం కులదీప్ యాదవ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ కు అవకాశమివ్వాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండర్ కావడంతో ఫైనల్ అవసరం ఎంతో ఉంటుందని భావిస్తున్నారు. కులదీప్ యాదవ్ కంటే వాషింగ్టన్ మాత్రమే బెటరన్న కామెంట్స్ వినపడుతున్నాయి. జడేజా, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ లతో బౌలింగ్ మరింత బలంగా తయారవుతుందని చెబుతున్నారు.
బ్యాటింగ్ ఆర్డర్ లో...
అదే సమయంలో బ్యాటింగ్ లో మాత్రం పెద్దగా మార్పులు చేయకుంటేనే బెటర్ అన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. శుభమన్ గిల్ వరసగా విఫలమవుతున్నా ఒకసారి క్లిక్ అయితే ఖచ్చితంగా మంచి స్కోరు వస్తుందని, అలాంటి గిల్ ను తప్పించడం మంచిది కాదని కూడా సూచనలు అందుతున్నాయి. రోహిత్ శర్మ కూడా అంతే. నిలదొక్కుకుంటే రోహిత్ నుఆపడం ఎవరి తరమూ కాదని, అందుకే రోహిత్, శుభమన్ గిల్ ను ఓపెనర్లుగానే కొనసాగించాలన్నది ఎక్కువ మంది అభిప్రాయంగా ఉంది. ఇప్పటి వరకూ జట్టులో ఎలాంటి మార్పులు చేయకపోయినప్పటికీ ఫైనల్స్ లో మాత్రం న్యూజిలాండ్ ను ఎదుర్కొనాలంటే బౌలింగ్ లో స్వల్ప మార్పులు చేయకతప్పదంటున్నారు. మరి ఏం చేస్తాన్నది చూడాలి.
Next Story