Mon Nov 18 2024 18:49:07 GMT+0000 (Coordinated Universal Time)
సంజయ్ సింగ్ కు ఊహించని షాక్
భారత రెజ్లింగ్ సమాఖ్య నూతన అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికయ్యాక వివాదాలు
భారత రెజ్లింగ్ సమాఖ్య నూతన అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికయ్యాక వివాదాలు మరింత ముదిరిపోయాయి. భారత రెజ్లర్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం రావడంతో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్యలో నూతనంగా ఎన్నికైన సంజయ్ సింగ్ కార్యవర్గాన్ని సస్పెండ్ చేస్తున్నట్టు కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నూతన కార్యవర్గం నిబంధనలు పాటించడంలో విఫలమైందని తెలిపింది. జాతీయస్థాయి జూనియర్ రెజ్లింగ్ పోటీలు ఈ నెలాఖరులో ప్రారంభం అవుతాయని సంజయ్ సింగ్ డిసెంబరు 21న ప్రకటించారని, నియామవళి ప్రకారం ఓ టోర్నీ ప్రారంభ తేదీకి కనీసం 15 రోజుల ముందు ప్రకటన చేయాల్సి ఉంటుందని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. సంజయ్ చేసిన ప్రకటనతో రెజ్లర్లు టోర్నీకి సిద్దమయ్యేందుకు తగినంత సమయం లేకుండా పోయిందని, ఇది నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది.
గతంలో భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా వ్యవహరించి, మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు సన్నిహితుడైన సంజయ్ సింగ్ చేతుల్లోకి అధికారాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లనివ్వమని స్టార్ రెజ్లర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ కూడా అయింది. ఇంతలోనే కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ సంచలన ప్రకటన చేసింది. భారత రెజ్లింగ్ సమాఖ్య పూర్తిగా గత కార్యవర్గం అదుపాజ్ఞల్లోనే పనిచేస్తున్నట్టుందని కేంద్రం కూడా చెప్పింది. దీంతో సంజయ్ సింగ్ కు ఊహించని షాక్ ఎదురైంది. ఇక భారత రెజ్లర్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.
Next Story