Sun Dec 22 2024 23:00:40 GMT+0000 (Coordinated Universal Time)
అది యావరేజి పిచ్.. ఐసీసీ చెప్పేసింది
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే!! అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ వరల్డ్ కప్ ఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్ కోసం ఉపయోగించిన పిచ్ నాసిరకంగా ఉందంటూ విమర్శలు వచ్చాయి. భారత్ ఓటమికి పిచ్ కారణం అని కూడా విమర్శలు వినిపించాయి. ఈ వాదనలు సాగుతున్న సమయంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఫైనల్ జరిగిన పిచ్ కు రేటింగ్ ను ఇచ్చింది. వరల్డ్ కప్ ఫైనల్ కోసం ఉపయోగించిన పిచ్ 'యావరేజి'గా ఉందంటూ ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ తన నివేదికలో పేర్కొన్నారు. వరల్డ్ కప్ లో భారత్ ఆడిన 11 మ్యాచ్ ల్లో 5 మ్యాచ్ లు ఇలాంటి 'యావరేజి' పిచ్ లపైనే నిర్వహించినట్టు ఐసీసీ తెలిపింది.
ఫైనల్ కోసం ఉపయోగించిన పిచ్ గతంలో పాకిస్తాన్‌తో భారత్ హై-వోల్టేజ్ గేమ్‌కు కూడా ఉపయోగించారట. ఈ మ్యాచ్ కూడా లో స్కోరింగ్ గేమ్‌గా మారింది. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్, మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా ప్రపంచ కప్ ఫైనల్ కు ఉపయోగించే పిచ్‌పై ఆందోళన వ్యక్తం చేశారు. టోర్నమెంట్ లో భారత బ్యాటర్లు తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినా.. చివరి గేమ్‌కు ఉపయోగించిన పిచ్‌ను వాడడాన్ని అభిమానులు కూడా ప్రశ్నించారు. మొదటి ఇన్నింగ్స్‌లో పిచ్ చాలా నెమ్మదిగా ఉండడంతో ఆస్ట్రేలియన్ బౌలర్లు పరిస్థితులను భారత్ కంటే మెరుగ్గా ఉపయోగించుకున్నారు. మొదటి సెమీఫైనల్‌కు ఉపయోగించిన ముంబై వాంఖడే పిచ్ కు 'గుడ్' అని రేటింగ్ ఇచ్చారు. అయితే రెండవ సెమీఫైనల్ కోసం ఈడెన్ గార్డెన్స్ పిచ్‌కు 'యావరేజి' రేటింగ్ లభించింది.
Next Story