Mon Dec 23 2024 02:45:44 GMT+0000 (Coordinated Universal Time)
పెద్ద టీమ్ లకు పెను శాపంగా మారుతున్న వర్షం
టీ20 వరల్డ్ కప్ టైటిల్ కొట్టాలని టోర్నమెంట్ లో బరిలోకి దిగిన ప్రతి ఒక్క జట్టుకు ఉంటుంది. ముఖ్యంగా చిన్న జట్ల మీద మంచి విజయాలను సాధించి పాయింట్లను రాబట్టుకోవాలని భావిస్తూ ఉంటాయి. కానీ ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో పెద్ద జట్లకు వర్షం భయం పట్టుకుంది. సునాయాసంగా గెలవగలం అని అనుకునే మ్యాచ్ లలో వర్షం అంతరాయం కలిగిస్తూ ఉంది. దీంతో టోర్నమెంట్ లో సందడి తగ్గడమే కాకుండా.. సెమీఫైనల్ అవకాశాలను భారీగా దెబ్బతీస్తూ ఉన్నాయి. ఇంగ్లండ్ కు ఫినిష్ చేసే అవకాశం ఉన్నప్పటికీ.. వర్షం పడడంతో బుధవారం నాడు ఐర్లాండ్ గెలిచినట్లు నిర్వాహకులు ప్రకటించేశారు.
వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలుగడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 5 పరుగుల తేడాతో ఐర్లాండ్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు ఇంగ్లండ్‌కు 158 పరుగుల విజయలక్ష్యాన్ని విధించింది. ఇంగ్లండ్ 14.3 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం పడటంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. మొయిన్ అలీ 24 పరుగులతో, లియామ్ లివింగ్‌స్టోన్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. దాంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఐర్లాండ్ 5 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించినట్లు అంపైర్లు ప్రకటించారు. అలీ, లివింగ్ స్టోన్ సత్తాను తక్కువ చేయలేము.. అయితే మ్యాచ్ పూర్తిగా జరిగి ఉండి ఉంటే ఇంగ్లండ్ దే విజయమని భావించే వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. ఇక ఆ తర్వాత మ్యాచ్ కూడా వర్షార్పణం అయింది. మెల్బోర్న్ స్టేడియంలో జరగాల్సిన కివీస్, ఆఫ్ఘన్ మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు అయ్యింది. వాతావరణంలో ఎటువంటి మార్పు కనిపించకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో కివీస్, ఆఫ్ఘన్ జట్లకు చెరో పాయింట్ వచ్చింది.
సూపర్-12లో భాగంగా ఈనెల 24న జింబాబ్వే-సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగింది. వర్షం వల్ల రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్ ను 9 ఓవర్లకు కుదించారు. జింబాబ్వే నిర్దేశించిన 80 పరుగుల లక్ష్య ఛేదనను దూకుడుగా ఆరంభించిన సఫారీలు.. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం మరో 13 పరుగులు చేస్తే విజయం దక్కేదే. కానీ మూడు ఓవర్ల సమయంలో వరుణుడు మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. దీంతో మ్యాచ్ ను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు.
వర్షం వల్ల వరుసగా మ్యాచ్ లు రద్దవుతుండటంతో టోర్నీ నిర్వాహకులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్ట్రేలియాలో ప్రస్తుతం వింటర్ సీజన్. వానలు పడుతాయని తెలిసినా ఐసీసీ ఈ టోర్నీని ఇప్పుడు ఎందుకు నిర్వహించిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచకప్ లో సెమీస్, ఫైనల్స్ కు తప్ప మిగతా మ్యాచ్ లకు రిజర్వ్ డే లేదు. సూపర్ - 12లో రెండు గ్రూపుల నుంచి టాప్-2లో ఉన్న జట్లు సెమీస్ కు చేరతాయి. సెమీస్ చేరే క్రమంలో మ్యాచ్ పాయింట్లు, నెట్ రన్ రేట్ కీలక పాత్ర పోషిస్తాయి. కానీ వర్షాల వలన గెలిచే మ్యాచుల్లో కూడా పెద్ద జట్లకు పూర్తీ పాయింట్లు దక్కడం లేదు.
Next Story