Sun Mar 30 2025 22:07:44 GMT+0000 (Coordinated Universal Time)
India Vs England : ఒకరు కాకుంటే.. మరొకరు.. వాళ్లు కాకపోతే ఇంకొకరు ఇదీ టీం ఇండియా సత్తా
భారత్ - ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో టీ 20 మ్యాచ్ లో చివరకు ఇండియాదే విజయం అయింది

భారత్ - ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో టీ 20 మ్యాచ్ లో చివరకు ఇండియాదే విజయం అయింది. ఉత్కంఠ పోరులో విజయం సాధించిన భారత్ ను మన తెలుగు కుర్రోడు తిలక్ వర్మ ఆదుకున్నాడు. చెన్నై చెపాక్ స్టేడియంలో నిన్న జరిగిన మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. తొలి మ్యాచ్ లో బ్యాట్ విదిలించిన వాళ్లంతా అవుట్ కావడంతో ఇక ఇండియా పని అయిపోయిందని, ఓటమి ఖాయమని భావించి టీవీలను కూడా క్రికెట్ ఫ్యాన్స్ ఆఫ్ చేసుకున్నారు. కానీ ఒకరు కాకుంటే.. మరొకరు.. వాళ్లు కాకుంటే.. ఇంకొకరు అన్నట్లుగా టీం ఇండియాను తిలక్ వర్మ గెలుపుతీరాలకు చేర్చాడు. దీంతో భారత్ - ఇంగ్లండ్ ల మధ్య జరిగే ఐదు టీ 20 సిరీస్ లలో భారత్ రెండు మ్యాచ్ లలో విజయం సాధించి పైచేయి తమదేనని మీసం మెలేసింది.
బౌలర్లు సక్సెస్ అయినా...
కోల్ కత్తా మాదిరిగానే చెన్నైలోని చెపాక్ లోనూ టాస్ భారత్ కే పడటంతో తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఇంగ్లండ్ బ్యాటర్లను కట్టడి చేయడంలో భారత బౌలర్లు కొద్దిగా శ్రమించినా తక్ుకవ పరుగులకు కట్టడి చేయగలిగారు. కుదురుకుంటున్న వారిని వెంటనే పెవిలియన్ కు పంపడంలో సక్సెస్ అయ్యారు. దీంతో ఇంగ్లండ్ ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 165 పరుగుల చేసింది. అక్షర్ పటేల్, వరుణ్ చెరో రెండు వికెట్లు, హార్ధిక్ పాండ్యా, అర్హదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలా ఒక వికెట్ తీసుకున్నారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో దూకుడు మీదున్నబట్లర్ ను 45 పరుగులకే నియంత్రించగలిగారు. ఇలా భారత్ జట్టు అతి తక్కువ స్కోరుకే ఇంగ్లండ్ ఆట ముగించగలిగింది.
పెద్దస్కోరు కాకపోయినా...
నిజానికి ఇది పెద్ద స్కోరు ఏమీ కాదు. కానీ తర్వాత మ్యాచ్ లోకి దిగిన ఓపెనర్లు ఇద్దరు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ పెద్దగా పరుగులు చేయకుండానే అవుటయ్యారు. సూర్యకుమార్ యాదవ్ కూడా పన్నెండు పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. ధ్రువ్ జురెల్, హార్థిక్ పాండ్యా కూడా విఫలం కావడంతో భారత ఓటమి ఖాయమనుకున్నారు. కానీ మనోడున్నాడు చూశారూ.. అదేనండీ తిలక్ వర్మ.. చెలరేగి ఆడాడు. నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 72 పరుగులు చేశాడు. వాషింగ్టన్ సుందర్ ఒక్కడే పరవాలేదనిపించాడు. 26 పరుగులు చేశాడు. వికెట్లు వరసగా పడుతున్నా చివరి వికెట్ సాయంతో మ్యాచ్ ను భారత్ వైపునకు తిప్పగలడంతో తిలక్ వర్మ ఆడిన ఇన్నింగ్స్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
Next Story