Fri Jan 10 2025 23:10:40 GMT+0000 (Coordinated Universal Time)
చివరి బాల్ వరకూ టెన్షనే...చివరకు సిరీస్ మనదే
టెన్షన్ పెట్టి చివరకు భారత్ సిరీస్ ను గెలుచుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ 20 మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది.
టెన్షన్ పెట్టి చివరకు భారత్ సిరీస్ ను గెలుచుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ 20 మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. చివరి బాల్ వరకూ టెన్షనే. ఎట్టకేలకు సిరీస్ ను గెలుచుకుని ప్రపంచ కప్ కు ముందు ఉప్పల్ స్టేడియంలో భారత్ విజయకేతనం ఎగురవేయగలిగింది. సూర్యకుమార్ యాదవ్, విరాట్ కొహ్లి చెలరేగడంతో మ్యాచ్ భారత్ పరమయింది. టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా తక్కువ పరుగులేమీ చేయలేదు. 20 ఓవర్లకు 186 పరుగులు చేసింది. కామెరూన్ గ్రీన్ కేవలం 21 బంతుల్లోనే 52 పరుగులు చేాడు. టిమ్ డేవిడ్ 27 బాల్స్ లో 54 పరుగులు చేశాడు. దీంతో భారీ స్కోర్ భారత్ ముందు ఉంది. అక్షర్ పటేల్ కీలకమైన మూడు వికెట్లు తీసుకోవడంతో ఏడు వికెట్కు 186 పరుగులు చేసింది.
తొలుత తడబడినా..
లక్ష్య సాధనలో భారత్ తొలుత తడబడింది. ఓపెనర్ గా దిగిన రాహుల్ ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా 7 పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. దీంతో భారత్ కష్టాల్లో పడిందనుకున్న దశలో విరాట్ కొహ్లి, సూర్యకుమార్ యాదవ్ లు కలసి మ్యాచ్ ను మలుపు తిప్పారు. సూర్యకుమార్ యాదవ్ 69 పరుగులతో చెలరేగిపోయాడు. విరాట్ కొహ్లి 63 పరుగులు చేశాడు. ఇక చివరి ఓవర్ లో 11 పరుగులు చేయాల్సి వచ్చింది. కొహ్లి ఒక సిక్సర్ కొట్టి తర్వాత బంతికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దినేష్ కార్తీక్, హార్థిక్ పాండ్యా ఉన్నారు. రెండు బాల్స్, నాలుగు పరుగులు చేయాల్సి ఉన్న తరుణంలో హార్థిక్ ఫోర్ కొట్టి మ్యాచ్ ను ముగించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా సూర్యకుమార్ యాదవ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా అక్షర్ పటేల్ ఎంపికయ్యారు.
Next Story