Mon Dec 23 2024 03:04:26 GMT+0000 (Coordinated Universal Time)
నేడే ఫైనల్.. ఇండియా లెజెండ్స్ మరోసారి టైటిల్ గెలిచేనా..?
ఇండియా లెజెండ్స్, శ్రీలంక లెజెండ్స్ మధ్య మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.
శనివారం రాయ్‌పూర్‌లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022 ఫైనల్ జరగనుంది. గత సీజన్ లో ఫైనల్ చేరిన భారత్, శ్రీలంక జట్లు ఈ ఏడాది కూడా రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఫైనల్ లో తలపడనున్నాయి. సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని ఇండియా లెజెండ్స్ తిలకరత్నే దిల్షాన్ సారథ్యంలోని శ్రీలంక లెజెండ్స్‌తో తలపడనుంది. ఇండియా లెజెండ్స్ తమ సెమీఫైనల్ పోరులో ఆస్ట్రేలియా లెజెండ్స్‌ను ఓడించగా, మరో సెమీఫైనల్లో శ్రీలంక లెజెండ్స్ వెస్టిండీస్ లెజెండ్స్‌పై విజయాన్ని అందుకుంది.
టోర్నమెంట్లో రెండు జట్లూ అద్భుతంగా ఆడాయి. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా రెండు జట్లు ఫైనల్‌కి చేరుకున్నాయి. సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని ఇండియా లెజెండ్స్ బ్యాటింగ్ లో తడబడుతూ ఉంది. ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ వీరోచిత ఇన్నింగ్స్‌తో సెమీ-ఫైనల్స్‌లో బలమైన ఆస్ట్రేలియా జట్టును ఓడించగలిగింది. భారత జట్టులోని మ్యాచ్ విన్నర్లు ఫైనల్ లో ఎలా ఆడుతారా అని అందరూ ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. భారత లెజెండ్స్ వరుసగా రెండో టైటిల్‌పై కన్నేశారు. శ్రీలంక జట్టు గత సీజన్ లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తూ ఉంది.
రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో ఇండియా లెజెండ్స్, శ్రీలంక లెజెండ్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇండియా లెజెండ్స్, శ్రీలంక లెజెండ్స్ మధ్య మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇండియా లెజెండ్స్ vs శ్రీలంక లెజెండ్స్ మ్యాచ్ భారతదేశంలోని కలర్స్ సినీప్లెక్స్ సూపర్‌హిట్స్, కలర్స్ సినీప్లెక్స్, స్పోర్ట్స్ 18 ఛానెల్‌లలో ప్రసారం చేయబడుతుంది. ఆన్ లైన్ లో చూడాలని అనుకునే వారు Voot, Jio TVలో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.
Next Story