Thu Nov 21 2024 23:21:10 GMT+0000 (Coordinated Universal Time)
India Vs Srilanka 2nd Odi Match : యంగ్ ఇండియానే బెటరేమో...సీనియర్లను తప్పించడం మంచిదేమో?
భారత్ - శ్రీలంక రెండో వన్డే మ్యాచ్ లో భారత్ ఘోర పరాజయం పాలయింది
భారత్ - శ్రీలంక రెండో వన్డే మ్యాచ్ చూసిన వారికి ఎవరికైనా ఇదే అనిపించక మానదు. ఎందుకంటే.. రోహిత్ శర్మ ఉన్నంత వరకూ మ్యాచ్ మనదేనని అనిపించింది. కానీ రోహిత్ అవుట్ అయిన తర్వాత వరసపెట్టి క్యూ కట్టారు. ఎవరూ క్రీజులో నిలవలేదు. టీ20 వరల్డ్ కప్ లో విన్నర్ గా నిలిచిన భారత్ జట్టు ఇదేనా? అనిపించేంత రీతిలో చెత్త ఆటతో సీనియర్ ఆటగాళ్లు చేజేతులా శ్రీలంకకు అప్పచెప్పారు. భారత్ - శ్రీలంక రెండో వన్డే మ్యాచ్ లో భారత్ ఘోర పరాజయం పాలయింది. బ్యాటర్లు రాణించక పోవడం వల్లనే ఈ ఓటమి మూటగట్టుకోవాల్సి వచ్చింది. మొదటి వన్డే కూడా గెలవాల్సిన తరుణంలో వరసగా అవుటయి టై చేసుకున్నారు. రెండో మ్యాచ్ 32 పరుగుల తేడాతో ఓటమి పాలయి నవ్వుల పాలయ్యారు.
వరసబెట్టి అవుటయి...
ఆటలో గెలుపోటములు సహజమే. అయితే ఇంత చెత్త ఆటను మాత్రం భారత్ ప్యాన్స్ కోరుకోలేదు. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే బౌలర్లు కూడా పెద్దగా రాణించలేకపోవడంతో 240 పరుగులకు శ్రీలంక ఆల్ అవుట్ అయింది. శ్రీలంక బ్యాటర్లలో ఆవిష్క నలభై పరుగులు, కమిందు నలభై పరుగులు, వెల్లలాగే 39 పరుగులు చేశారు. వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు, కులదీప్ యాదవ్ రెండు వికెట్లు తీశారు. నిజానికి భారత్ ముందు ఇది పెద్ద లక్ష్యమేమీ కాదు. ఎందుకంటే భారత్ బ్యాటింగ్ బలంగా ఉందని అందరూ నమ్మడమే. అది ఉత్తదని తర్వాత కానీ తేలలేదు. ఎందుకంటే రోహిత్ శర్మ, అక్షర్ పటేల్, శుభమన్ గిల్ మినహా ఎవరూ పెద్దగా క్రీజులో నిలబడలేకపోయారు.
రోహిత్ ఉన్నంత సేపు...
రోహిత్ శర్మ ఉన్నంత సేపు లంక బౌలర్లకు చెమటలు పట్టించాడు. స్కోరు బోర్డు వేగాన్ని కూడా పెంచాడు. రోహిత్ శర్మ 44 బంతుల్లో 64 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ 44, పరుగులు చేశాడు. శుభమన్ గిల్ 35 పరుగులు చేసి వెళ్లిపోయాడు. విరాట్ కొహ్లి పథ్నాలుగు పరుగులకే అవుటయి నిరాశపర్చాడు. దూబే ఎందుకు వచ్చాడో.. ఎందుకు వెళ్లాడో అతగాడికే తెలియదు. కేఎల్ రాహుల్ డకౌట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ ఏడు పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. శ్రీలంక స్పిన్నర్ వాండర్సే భారత్ జట్టును ఒక పని పట్టాడు. ఆరు వికెట్లు తీసుకున్నాడంటే అతడి బౌలింగ్ కు మనోళ్లు ఎలా చిక్కుకుపోయారో అర్థమవుతుంది. దీంతో వన్డే సిరీస్ లో శ్రీలంక ఆధిపత్యం కొనసాగిస్తుంది. మరి మూడో వన్డే బుధవారం జరగనుంది. ఈ మ్యాచ్ లో ఏం ఆడతారో? ఏమో?
Next Story