Sun Dec 22 2024 07:27:45 GMT+0000 (Coordinated Universal Time)
India Vs Bangladesh T 20 : భారత్ క్లీన్ స్వీప్... రికార్డుల మీద రికార్డులు.. ఇక ఎదురేలేదా?
ఇండియా - బంగ్లాదేశ్ మధ్య జరిగిన టీ 20 మ్యాచ్ లో భారత్ రికార్డు స్థాయి స్కోరు నమోదు చేసింది
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం అంటే బ్యాటర్లకు స్వర్గధామం. ఇక్కడే ఐపీఎల్ లో అనేక రికార్డులు బద్దలయ్యాయి. మరోసారి కూడా ఈ రికార్డును ఇదే ఉఫ్పల్ స్టేడియం బ్రేక్ చేసింది. ఇండియా - బంగ్లాదేశ్ మధ్య జరిగిన టీ 20 మ్యాచ్ లో భారత్ రికార్డు స్థాయి స్కోరు నమోదు చేసింది. టీ20లలోనే ఇది అత్యధిక స్కోరు కావడం విశేషం. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరవై ఓవర్లలో 297 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 164 పరుగులు మాత్రమే చేయగలిగింది.
మూడు సిరీస్ లలో...
సుమారు 138 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. దీంతో మూడు టీ 20 మ్యాచ్లలో భారత్ విజయం సాధించింది. సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. అభిషేక్ సింగ్ వెంటనే అవుటయినా, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ లు బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. సంజూ శాంసన్ ఓపెనర్ గా దిగి 111 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది సిక్సర్లు, 11 ఫోర్లున్నాయి. 47 బంతుల్లో ఈ పరుగులు చేశాడు.
బ్యాటర్ల దెబ్బకు...
సంజూ శాంసన్ ఒక ఓవర్ లో ఐదు సిక్సర్లు కొట్టాడంటే ఏ రకంగా ఆడాడో అర్థం చేసుకోవచ్చు. సూర్యకుమార్ యాదవ్ కూడా అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హార్ధిక్ పాండ్యా 47 పరుగులతో రాణించాడు. రియాన్ పరాగ్ 34 పరుగులు చేసి స్కోరును పెంచాఢు. రింకు సింగ్ చివరిగా సిక్సర్ కొట్టి భారత్ కు 297 స్కోరును అందించగలిగారు. ఉప్పల్ స్టేడియంలో పరుగుల సునామీని క్రికెట్ ఫ్యాన్స్ చూడగలిగారు. అయితే బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తిఫిజుర్, మహ్మదుల్లా తలో వికెట్ తీయగా, షకీబ్ మూడు వికెట్లు తీశాడు.
తక్కువ స్కోరుకే...
తర్వాత బరిలోకి దిగిన బంగ్లాదేశ్ తొలి ఓవర్లోనే తొలి బంతికి వికెట్ కోల్పోయింది. వరస వికెట్లు పడుతూ పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే హిర్దోయ్ 63 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ బ్యాటర్లలో లిటన్ దాస్ 42 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్లందరూ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. అయితే భారత్ బౌలర్లలో మూడో మ్యాచ్ కు దిగిన రవి బిష్ణోయ్ మూడు వికెట్లు తీసి బంగ్లా వెన్ను విరిచాడు. మయాంక్ యాదవ్ రెండు, వాషింగ్టన్ సుందర్, నితీష్ రెడ్డి చెరో వికెట్ తీశారు.
Next Story