Mon Dec 23 2024 11:38:05 GMT+0000 (Coordinated Universal Time)
బంగ్లాదేశ్ పై ఘన విజయం సాధించిన భారత్
ఆసియా కప్ మహిళల టోర్నమెంట్ లో భారత జట్టు మరో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం పాకిస్థాన్ మీద భారత జట్టు ఓడిపోగా.. శనివారం నాడు మాత్రం బంగ్లాదేశ్ ను అన్ని విభాగాల్లోనూ చిత్తు చేసింది. ఈ విజయంతో భారత్ సెమీఫైనల్ లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్ లో టీమిండియా 60 పరుగుల తేడాతో భారీ విజయన్ని నమోదు చేసింది. మరో లీగ్ మ్యాచ్ మిగిలి ఉండగానే సెమీఫైనల్ లోకి అడుగుపెట్టింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 159 పరుగులు చేసింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (44 బంతుల్లో 55; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), స్మృతి మంధాన (38 బంతుల్లో 47; 6 ఫోర్లు) రాణించారు. చివర్లో జెమీమా రోడ్రిగ్స్ (24 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు) దూకుడుగా ఆడటంతో భారత్ మెరుగైన స్కోరును అందుకుంది. ఓపెనర్లుగా వచ్చిన స్మృతి మంధాన, షఫాలీ వర్మలు తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. వీరు తొలి వికెట్ కు 12 ఓవర్లలనే 100 పరుగులు జోడించారు. స్మృతి మంధాన సమన్వయ లోపంతో రనౌట్ అయ్యింది. కాసేపటికే షఫాలీ వర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. ఆఖర్లో భారత అమ్మాయిలు కాస్త తడబడ్డారు. చివరి 8 ఓవర్లలో భారత్ కేవలం 50 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లను కోల్పోయింది. బంగ్లాదేశ్ బౌలర్లలో రుమాన అహ్మద్ 3 వికెట్లు తీసింది.
160 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 100 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లా జట్టులో కెప్టెన్ నిగర్ సుల్తానా (36) టాప్ స్కోరర్ గా నిలిచింది. ఓపెనర్లుగా వచ్చిన ఫర్జానా హక్ (30), ముషిద ఖాటున్ (21) తొలి వికెట్ కు 45 పరుగులు జోడించారు. చాలా స్లోగా ఆడుతూ వెళ్లడంతో రన్ రేట్ బాగా పెరిగిపోయింది. వన్ డౌన్ లో వచ్చిన నిగర్ సుల్తానా కూడా భారీ షాట్లను ఆడటంలో విఫలం అయ్యింది. ఆ తర్వాత వచ్చిన వాళ్లు కూడా పెద్దగా రాణించలేకపోయారు. 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 100 పరుగులు మాత్రమే చేసింది. దీప్తి శర్మ, షఫాలీ వర్మలు చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.
షఫాలీ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో ఆడిన 5 మ్యాచ్ ల్లో నాలుగింటిలో నెగ్గిన భారత్ 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. థాయ్ లాండ్ తో జరిగే మ్యాచ్ లో గెలుపోటములతో సంబంధం లేకుండా భారత్ నాకౌట్ దశకు చేరుకుంది.
Next Story