Mon Dec 23 2024 07:02:00 GMT+0000 (Coordinated Universal Time)
India vs South Africa T20 : అదీ దెబ్బ అంటే.. దెబ్బకు దెబ్బ.. కసి తీర్చుకున్నారు బ్రో
ఇండియా దక్షిణాఫ్రికాపై మూడో టీ20లో విజయం సాధించింది. దీంతో దక్షిణాఫ్రికాలో జరుగుతున్న టీ 20 సిరీస్ ను సమం చేయగలిగింది
టీం ఇండియా దక్షిణాఫ్రికాపై మూడో టీ20లో విజయం సాధించింది. దీంతో దక్షిణాఫ్రికాలో జరుగుతున్న టీ 20 సిరీస్ ను సమం చేయగలిగింది. తొలి మ్యాచ్ వర్షంతో నిలిచిపోగా, రెండో మ్యాచ్ బౌలర్ల వైఫల్యంతో భారత్ దక్షిణాఫ్రికాకు తలవంచాల్సి వచ్చింది. ఇక సిరీస్ ను సమం చేయాల్సిన నిర్ణయాత్మక మ్యాచ్ లో ఇటు బౌలర్లు, అటు బ్యాటర్లు ధనాధన్ ఆట ఆడేశారు. ఉతికి పారేశారు. టాస్ ఎవడిది కాదన్నయ్యా... గెలుపు ముఖ్యం అన్నట్లు ఆడారు.. ఇది కదా మనకు కావాల్సింది.
టాస్ వాళ్లు గెలిచినా....
టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఎప్పటిమాదిరిగానే ఫీల్డింగ్ ఎంచుకుంది. జోహెన్స్బెర్గ్ మైదానం ఎక్కువ పరుగులు తెచ్చి పెట్టే గ్రౌండ్ కావడంతో తొలి నుంచి మన బ్యాటర్లు దూకుడుగానే ఆడారు. శుభమన్ గిల్ అవుట్ కాకుండానే ఎల్.బి. డబ్ల్యూ అని అంపైర్ చేతులెత్తగానే వెనుదిరిగి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ప్లేలో మాత్రం అది నాటౌట్ గా తెలిసింది. శుభమన్ గిల్ అవుట్ అయితేనేం.. మన సూర్య ఉన్నాడుగా.. ఇక మనోడు మిస్టర్ 360 అంటే మరోసారి నిరూపించాడు. మైదనానికి నలుమూలల సిక్సర్లు, ఫోర్లు బాది వదిలి పెట్టాడు. ఎనిమిది సిక్సర్లు, ఏడు ఫోర్లతో సెంచరీ కొట్టేశాడు.
యశస్వి కూడా...
యశస్వి జైశ్వాల్ కూడా అదే తీరున ఆడాడు.41 బంతుల్లో మూడు సిక్సర్లు, ఆరు ఫోర్లతో అరవై పరుగులు చేసి అవుటయ్యాడు. మొత్తం మీద టీం ఇండియా 20 ఓవర్లకు 201 పరుగులు చేసింది. ఏడు వికెట్లు కోల్పోయింది. అయితే దక్షిణాఫ్రికాకు సొంత మైదానం కావడంతో ఇది పెద్ద స్కోరు కాకపోవచ్చని అనిపించింది. ఎందుకంటే దక్షిణాఫ్రికాలోనూ హిట్టర్లున్నారు. మనమేమో బౌలింగ్ లో వీక్ అని గత మ్యాచ్ లో తేలిపోయే. దీంతో ఫ్యాన్స్ ఉగ్గబట్టుకుని చూస్తుండి పోయారు. అయితే మన బౌలర్లు విజృంభించి ఆడటంతో దక్షిణాఫ్రికా ఆటగాళ్లను వరసగా అవుట్ చేసి సిరీస్ ను సమం చేయగలిగింది.
వరసగా వికెట్లు...
ముకేశ్ రెండో ఓవర్ లోనే బ్రీజకెను బౌల్డ్ చేశాడు. సిరాజ్ త్రో దెబ్బకు హెండ్రిక్స్ రనౌట్ తో వెనుదిరిగాడు. క్లాసెన్ మన ఫెయిల్యూర్ బౌలర్ అర్ష్దీప్ అవుట్ చేయగలిగాడు. మార్క్రమ్ ను జడేజా అవుట్ చేశాడు. 11 ఓవర్లకు గాను దక్షిణాఫ్రికాను 82 పరుగులకే పరిమితం చేయగలిగారు. అప్పటికే ఆరు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా ఇక ఎంత మాత్రం విజయం సాధించలేదని అనిపించింది. తర్వాత కులదీప్ మాయాజాలం మళ్లీ పనిచేసింది. భారత్ దే పై చేయి అయింది. సిరీస్ సమం అయింది.
Next Story