Mon Dec 23 2024 05:59:47 GMT+0000 (Coordinated Universal Time)
SA vs IND:పిచ్ గురించి రచ్చ.. కడిగేసిన రోహిత్ శర్మ, సునీల్ గవాస్కర్
కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ స్టేడియం వేదికగా భారత్ - సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్టు కేవలం
SA vs IND :కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ స్టేడియం వేదికగా భారత్ - సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్టు కేవలం 2 రోజుల్లోనే ముగిసిపోయింది. దీంతో పిచ్‌ల గురించి విమర్శలు వెల్లువెత్తున్నాయి. తొలిరోజే 23 వికెట్లు పడడంతో పిచ్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మొదటి రోజు నుంచే పిచ్‌పై సీమ్ లభించడంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. టెస్ట్ క్రికెట్ అత్యుత్తమమని చెబుతుంటారు. మరి దానికి కట్టుబడి ఉండాలి కదా.. మీరు ఒక సవాలు విసిరినప్పుడు దానిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇండియాలో మొదటి రోజే పిచ్‌పై బంతి తిరగడం మొదలైతే తెగ విమర్శిస్తారు అంటూ రోహిత్ శర్మ కొందరిపై విమర్శలు గుప్పించారు. భారత్ లో పిచ్‌పై దుమ్ము లేస్తోంది, పిచ్‌పై చాలా పగుళ్లు ఉన్నాయని అంటుంటారని.. ఎక్కడికి వెళ్లి ఆడినా తటస్థంగా ఉండటం చాలా కీలకం. ముఖ్యంగా మ్యాచ్ రిఫరీలు ఇందుకు కట్టుబడి ఉండాలని రోహిత్ శర్మ తెగేసి చెప్పాడు. కొంతమంది రిఫరీలు పిచ్‌లను ఎలా రేట్ చేస్తారనేది వారు ఆలోచించుకోవాలని రోహిత్ కౌంటర్లు వేశాడు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగిన అహ్మదాబాద్ పిచ్‌కు సగటు కంటే తక్కువ రేటింగ్ ఇవ్వడాన్ని తాను ఇంకా నమ్మలేకపోతున్నానని.. ఒక బ్యాటర్ అక్కడ సెంచరీ సాధిస్తే అది పేలవమైన పిచ్ ఎలా అవుతుందని ప్రశ్నించాడు. కాబట్టి ఐసీసీ, మ్యాచ్ రిఫరీలు ఆతిథ్య దేశాన్ని బట్టి కాకుండా పిచ్‌లను బట్టి రేటింగ్ చేయడం మొదలు పెట్టాలని సూచించాడు రోహిత్. కేప్‌టౌన్ లాంటి పిచ్‌లపై ఆడడం తమకు గర్వకారణమని.. తటస్థంగా ఉండాలని చెప్పదలచుకున్నామని తెలిపారు.
టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. బ్యాటర్ల మీదకు బంతులు దూసుకొచ్చే పిచ్‌లపై ఆడలేకపోతే బ్యాటర్ కాదనే ధోరణి కనిపిస్తోంది. ముఖ్యంగా సేనా (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) మీడియా వైఖరి ఈ విధంగా ఉంటుందని అన్నారు. ఫాస్ట్, బౌన్సీ పిచ్‌లపై ఆడలేకపోతే బ్యాట్స్‌మెన్ కాదని అనుకుంటూ ఉంటారని.. అయితే బంతి టర్న్ అయ్యే పిచ్‌పై ఆడలేకపోతేనే బ్యాటర్ కాదని నేను భావిస్తున్నానని సునీల్ గవాస్కర్ అన్నాడు. పిచ్‌ల విషయంలో మీడియా వాస్తవాలు మాట్లాడాలని సునీల్ గవాస్కర్ కౌంటర్ వేశాడు.
Next Story