లక్ష్మణ్ 'వెరీ వెరీ స్పెషల్' ఎలా అయ్యాడంటే..
భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఈరోజు తన 49వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.
భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఈరోజు తన 49వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. దీంతో లక్ష్మణ్‌కు క్రికెట్ ప్రపంచం నుండి అభిమానులు, ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. లక్ష్మణ్ నవంబర్ 1న 1974న హైదరాబాద్‌లోని విద్యావంతుల కుటుంబంలో జన్మించాడు. లక్ష్మణ్ స్వయంగా మెడిసిన్ వదిలేసి క్రికెటర్ అయ్యాడు. అతని క్రికెట్ కెరీర్ చాలా అద్భుతంగా సాగింది. అందుకే అతడిని 'వెరీ వెరీ స్పెషల్' క్రికెటర్ అనే పిలుస్తుంటారు.
వీవీఎస్ లక్ష్మణ్ కుటుంబానికి మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కుటుంబంతో బంధుత్వం ఉంది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశానికి రెండవ రాష్ట్రపతి. లక్ష్మణ్ కుటుంబం మొదటి నుంచి ఉన్నత విద్యావంతుల కుటుంబం. అతని తల్లిదండ్రులు వైద్యులు. లక్ష్మణ్ కూడా డాక్టర్ చదివేందుకు సిద్ధమయ్యాడు. కానీ క్రికెట్ పట్ల అతని ఆసక్తి, అంకితభావం అతడిని మెడిసిన్ చేయనీయలేదు. అందుకే క్రికెట్‌ను కెరీర్‌గా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.
వీవీఎస్ లక్ష్మణ్ క్రికెట్ కెరీర్ చాలా అద్భుతంగా సాగింది. 2001లో ఆస్ట్రేలియాపై ఆడిన అతని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌ను ఇప్పటికీ ఎవరూ మరచిపోలేరు. లక్ష్మణ్ ఇన్నింగ్స్ ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియాపై ఫాలో-ఆన్ ఆడుతున్న భారత్‌ను ఓటమి నుంచి గట్టెక్కించింది. మ్యాచ్ విజయంలో లక్ష్మణ్ కీలకపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో వీవీఎస్ లక్ష్మణ్ 281 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆ ఇన్నింగ్స్ తర్వాత అతడిని అభిమానులతో సహా క్రీడాప్రముఖులు 'వెరీ వెరీ స్పెషల్' అని పిలవడం ప్రారంభించారు. క్రికెట్‌కు అతడు చేసిన విశిష్ట సేవలకు గాను భారత ప్రభుత్వం అతడిని పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
వీవీఎస్ లక్ష్మణ్ తన క్రికెట్ కెరీర్లో 134 టెస్టులు, 86 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. లక్ష్మణ్ 1996లో టెస్ట్ క్రికెట్లో, 1998లో వన్డే క్రికెట్లో అరంగేట్రం చేశాడు. టెస్టు క్రికెట్లో 8,781 పరుగులు, వన్డేల్లో 2,388 పరుగులు చేశాడు. తన తొలి వన్డే మ్యాచ్‌లో ఖాతా తెరవకుండా అవుటైన లక్ష్మణ్ ఆరు సెంచరీలు చేశాడు. టెస్టుల్లో 17 సెంచరీలు, 56 అర్ధ శతకాలు తన ఖాతాలో వేసుకున్నాడు.