Sun Dec 22 2024 16:42:20 GMT+0000 (Coordinated Universal Time)
ఐపీఎల్ ఫైనల్: నో థ్రిల్లర్.. విన్నర్ గుజరాత్ టైటాన్స్
ఐపీఎల్ 2022 ఫైనల్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుందని భావించగా.. క్రికెట్ అభిమానులకు ఎలాంటి థ్రిల్లర్ మ్యాచ్ ను ఇవ్వలేదు.
ఐపీఎల్ 2022 ఫైనల్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుందని భావించగా.. క్రికెట్ అభిమానులకు ఎలాంటి థ్రిల్లర్ మ్యాచ్ ను ఇవ్వలేదు. ఈ టోర్నీ మొదటి నుండి ఛాంపియన్ జట్టుగా ఆడిన గుజరాత్ టైటాన్స్ టోర్నీలో అడుగుపెట్టిన తొలి సీజన్ లోనే టైటిల్ ను ఎగరేసుకుపోయింది. ఇక 2008 మ్యాజిక్ ను రిపీట్ చేయాలని అనుకున్న రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ లో తేలిపోయింది. ఏ దశలోనూ గుజరాత్ టైటాన్స్ కు పోటీ ఇవ్వలేకపోయింది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.. జట్టును ఫైనల్ కు చేర్చడమే కాకుండా ఫైనల్ లో అద్భుతమైన ఆల్ రౌండర్ ప్రదర్శన కనబరిచి గుజరాత్ కు అలవోక విజయాన్ని అందించడంలో తోడ్పడ్డాడు.
ఐపీఎల్ ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ జట్టును గుజరాత్ టైటాన్స్ బౌలర్లు ఏ దశలోనూ భారీ స్కోరు సాధించేందుకు అవకాశం ఇవ్వలేదు. గుజరాత్ బౌలర్ల ధాటికి రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. జోస్ బట్లర్ 39 పరుగులు చేయగా, మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 22 పరుగులు చేశాడు. కెప్టెన్ సంజూ శాంసన్ 14, దేవదత్ పడిక్కల్ 2, హెట్మెయర్ 11, అశ్విన్ 6, రియాన్ పరాగ్ 15, బౌల్ట్ 11, మెక్ కాయ్ 8 పరుగులు చేశారు. బట్లర్ వికెట్ ను గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పడగొట్టడం విశేషం. గుజరాత్ బౌలర్లలో పాండ్యాకు 3 వికెట్లు, సాయి కిశోర్ కు 2, షమీకి 1, యశ్ దయాళ్ కు 1, రషీద్ ఖాన్ కు 1 వికెట్ దక్కాయి.
పెద్ద టార్గెట్ కాకపోవడంతో.. గుజరాత్ జట్టు 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించింది. 131 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆరంభంలోనే ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (5) వెనుదిరిగినా, కెప్టెన్ పాండ్యా ఓపెనర్ శుభ్ మాన్ గిల్ రాజస్థాన్ బౌలర్లకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. పాండ్యా 34 పరుగులు చేసి చహల్ బౌలింగ్ లో అవుటయ్యాడు. గిల్ (45 నాటౌట్), మిల్లర్ (32 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ జట్టుకు విజయాన్ని అందించారు.
ఐపీఎల్ తాజా సీజన్ విజేతగా నిలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు ట్రోఫీతో పాటు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. రన్నరప్ గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ కు రూ.13 కోట్ల ప్రైజ్ మనీ దక్కగా, క్వాలిఫయర్-2 మ్యాచ్ లో ఓటమిపాలై టోర్నీలో మూడో స్థానంలో నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు రూ.7 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో ఓటమిపాలైన లక్నో సూపర్ జెయింట్స్ రూ.6.5 కోట్ల ప్రైజ్ మనీ సొంతం చేసుకుంది.
News Summary - gujarat titans won by 7 wickets in ipl 2022 final
Next Story