Mon Dec 23 2024 02:31:26 GMT+0000 (Coordinated Universal Time)
ఆరంభ మ్యాచ్‌లో.. ఫైనల్ పోరులోనూ వారే తలపడుతున్నారు
మరో విషయమేమిటంటే.. ప్లేఆఫ్స్ మొదటి మ్యాచ్‌లోనూ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి.
ఐపీఎల్-2023 చివరి దశకు చేరుకుంది. ఆదివారం టైటిల్ పోరు జరుగనుంది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ 62 పరుగుల తేడాతో ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ఫైనల్స్‌కు చేరుకుంది. ఐపీఎల్ 16వ సీజన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌తో ప్రారంభమైంది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. బదులుగా గుజరాత్ 19.2 ఓవర్లలో ఐదు వికెట్లకు 182 పరుగులు చేసి విజయం సాధించింది. అలా ప్రారంభమైన ఐపీఎల్ సీజన్ తుది దశలో యాదృచ్చికంగా ఆ రెండు జట్లే చివరి మ్యాచ్(ఫైనల్స్)లో తలపడనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ ఆసక్తికరంగా ఉంటుందని భావిస్తున్నారు.
మరో విషయమేమిటంటే.. ప్లేఆప్స్ మొదటి మ్యాచ్‌లోనూ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేయగా.. గుజరాత్ టైటాన్స్ 157 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా చెన్నై నేరుగా ఫైనల్స్‌లోకి అడుగుపెట్టగా.. గుజరాత్ మాత్రం క్వాలిఫయర్-2లో ముంబైపై గెలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించింది. దీంతో ప్లేఆప్స్‌లో ఎదురైన ఓటమికి చెన్నైపై ప్రతీకారం తీర్చుకునేందుకు గుజరాత్ సన్నద్ధమవుతుంది. శుభ్‌మన్ గిల్ ఫామ్ గుజరాత్‌కు కలిసొస్తుంది.
ఈ సీజన్లో ఇరు జట్లు అద్భుత ప్రదర్శన చేశాయి. లీగ్ రౌండ్లో ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాలలో నిలిచాయి. గుజరాత్ 20 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. చెన్నై 17 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ రెండు జట్లు ఫైనల్ మ్యాచ్‌లో తలపతుతాయి. ఈ మ్యాచ్ కోసం ప్రతి అభిమాని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ధోనీ కారణంగా సీఎస్కేకు ఎక్కడైనా గట్టి మద్దతు ఉంటుంది. దీంతో సీఎస్కే ఆటగాళ్లు ఆడిన ప్రతిచోటును హోమ్ గ్రౌండ్‌గా భావిస్తారు. ఇక గుజరాత్ టైటాన్స్‌కు ఈ స్టేడియం హోం గ్రౌండ్. దీంతో ఆ జట్టుకు ఫైనల్లో కలిసొస్తుందని టీం మేనేజ్మెంట్ భావిస్తోంది.
Next Story