రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న క్రికెటర్.. తనో స్పోర్ట్స్ మినిష్టర్..!
క్రికెటర్ మనోజ్ తివారీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.
క్రికెటర్ మనోజ్ తివారీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. మనోజ్ తివారీ మళ్లీ బెంగాల్ క్రికెట్ జట్టుకు ఆడాలనుకుంటున్నాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్నేహసిస్ గంగూలీతో చర్చించిన తర్వాత మనోజ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. తివారీ గత గురువారం రిటైర్మెంట్ ప్రకటించాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌తో చర్చించిన తివారీ మళ్లీ క్రికెట్ ఫీల్డ్‌లోకి తిరిగి రాబోతున్నాడు. అయితే.. తివారీ తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాల్సివుంది.
బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు స్నేహసిస్ గంగూలీ రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేయాలని.. బెంగాల్ కోసం మరికొన్ని మ్యాచ్‌లు ఆడాలని తివారిని అభ్యర్థించారు. మనోజ్ తివారీ అందుకు అంగీకరించారు. మనోజ్ నాయకత్వంలో బెంగాల్ గతేడాది రంజీ ట్రోఫీలో రన్నరప్‌గా నిలిచింది. మనోజ్ బెంగాల్ క్రికెట్లో అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాళ్లలో ఒకడు.. అలాంటి ఆటగాడు జట్టును విడిచిపెట్టడం మిడిల్ ఆర్డర్లో భారీ వెలితిగా ఉంటుందని స్నేహసిస్ గంగూలీ అభిప్రాయంగా తెలుస్తోంది.
గత గురువారం హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించిన మనోజ్ మీడియా ఇంటరాక్షన్లకు దూరంగా ఉన్నాడు. మనోజ్ హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించినప్పటంతో ఊహాగానాలు జోరందుకున్నాయి. తివారీ మళ్లీ క్రికెట్లోకి వస్తున్నాడని తెలియడంతో వాటికి తెరపడింది. తివారీ కెరీర్లో 141 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 29 సెంచరీలు, 45 అర్ధసెంచరీలతో 10,000 పరుగులకు 92 రన్స్ దూరంలో ఉన్నాడు. తివారి టీమిండియా తరఫున 12 వన్డేలు, 3 టీ20లు ఆడాడు. మనోజ్ తివారి రాజకీయాల్లో కూడా రాణిస్తున్నాడు. ఆయన ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర యువజన, క్రీడా శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.