Mon Mar 31 2025 09:18:58 GMT+0000 (Coordinated Universal Time)
India Vs England T20 : బట్లర్ బ్యాచ్ ను ఉతికి ఆరేసిన భారత్.. చివరి మ్యాచ్ తేలిపోయిందిగా?
భారత్ - ఇంగ్లండ్ మధ్య ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ వన్ సైడ్ గా సాగింది. అభిషేక్ శర్మ అరుదైన సెంచరీ చేశాడు

భారత్ - ఇంగ్లండ్ మధ్య ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ వన్ సైడ్ గా సాగింది. ఒకరకంగా భారత్ బట్లర్ గ్యాంగ్ పై విరుచుకుపడిందనే చెప్పాలి. రికార్డులు కూడా నమోదు చేసింది. ఒకరకంగా ముంబయిలో ఊచకోత కోశారు మనోళ్లు. టీ 20లలో మనతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇంగ్లండ్ ఆటగాళ్లకు రుచి చూపించారు. మూడో మ్యాచ్ లో తొండాట అన్న వారి నోళ్లను మూయించారు. అదృష్టం కాదు భయ్యా.. షాట్లు కొట్టడం అంటే ఇలా.. అని బ్యాట్ తో తన సత్తా చూపించారు. అందులో అభిషేక్ శర్మ చెలరేగిపోతే ఇక ఆపేవాళ్లు ఎవరు? అందుకే ముంబయిలో భారీ స్కోరును భారత్ నమోదు చేసింది. ఇరవై ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది.
పరుగులా అవి...
తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ తొలి బంతినే సంజూ శాంసన్ సిక్సర్ గా మలచి మ్యాచ్ ఇలా ఉంటుందని చెప్పకనే చెప్పాడు. తర్వాత సంజూ అవుటయినా అభిషేక్ శర్మను ఆపడం ఎవరి తరమూ కాలేదు. ఏం ఆట అది. చూసి తీరాల్సిందే. ఎటు చూసినా షాట్లే. ప్రతి బంతిని బౌండరీకి, సిక్సర్లుగా మలచిన తీరును చూసి ప్రత్యర్థులు సయితం నోరెళ్ల బెట్టారు. కేవలం 37 బంతుల్లోనే అభిషేక్ శర్మ సెంచరీ పూర్తి చేశాడంటే ఏ రేంజ్ లో ఆడాడో అర్థం చేసుకోవచ్చు. ఇందులో 13 సిక్సర్లు ఉన్నాయి. ఏడు ఫోర్లున్నాయి. అభిషేక్ శర్మ ఒక్కడే యాభై నాలుగు బంతుల్లో 135 పరుగులు చేశాడు. మిగిలిన జట్టులో శివమ్ దుబే కూడా విజృంభించి ఆడి ముప్ఫయి పరుగులు చేసి భారత్ కు అత్యధిక పరుగులను సాధించిపెట్టాడు.
భారీ లక్ష్యాన్ని...
ఇక తర్వాత భారీ లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన ఇంగ్లండ్ పెద్దగా సత్తా చూపకుండానే మన బౌలర్లు ఎప్పటికప్పుడు వికెట్లు తీస్తూ వారి నడ్డి విరిచేశారు. సాల్ట్ ఒక్కడే అర్ధసెంచరీ చేశారు. మిగిలిన వాళ్లంతా తక్కువ పరుగులకే అవుటాయ్యారు. ఐదో టీ 20 మ్యాచ్ ను భారత్ 97 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ను ఓడించింది. దీంతో సిరీస్ ను 4 -1 తో కైవసం చేసుకుంది. అభిషేక్ శర్మ టీ 20లలో రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ చేశాడు. అంతేకాదు అభిషేక్ శర్మ బౌలింగ్ లోనూ సత్తా చూపాడు. రెండు వికెట్లు తీశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. మొత్తం మీద అనుకున్నట్లుగానే ముంబయిలోని వాంఖడే స్టేడియంలో పరుగుల వరద పారింది. పరుగులతో అభిషేకం చేశాడు. ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. టీ 20 మ్యాచ్ లలో తమకు తిరుగులేదని మరొకసారి మనోళ్లు ఇంగ్లండ్ జట్టుకు రుచి చూపించారు.
Next Story