Mon Dec 23 2024 12:26:04 GMT+0000 (Coordinated Universal Time)
Neeraj Chopra ఒక్క సెంటీమీటర్.. నీరజ్ చోప్రా ఏ స్థానానికి పరిమితమయ్యాడంటే?
పీటర్స్ ప్రతిష్టాత్మక డైమండ్ ట్రోఫీని గెలుచుకున్నాడు
సెప్టెంబర్ 14, శనివారం జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్లో భారతదేశానికి చెందిన నీరజ్ చోప్రా పురుషుల జావెలిన్ పోటీలో రెండో స్థానంలో నిలిచాడు. పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అండర్సన్ పీటర్స్ కంటే కేవలం ఒక్క సెంటీమీటర్ తక్కువ మాత్రమే విసిరి రెండవ స్థానంతో నీరజ్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బ్రస్సెల్స్‌లోని కింగ్ బౌడౌయిన్ స్టేడియంలో జరిగిన పోటీలో నీరజ్ అత్యుత్తమ ప్రయత్నంగా 87.86 మీటర్లు విసరగా.. పీటర్స్ కంటే కేవలం ఒక సెంటీమీటర్ మాత్రమే వెనుకబడి ఉన్నాడని తేలింది. పీటర్స్ ప్రతిష్టాత్మక డైమండ్ ట్రోఫీని గెలుచుకున్నాడు.
జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ తన అత్యుత్తమ ప్రయత్నంతో 85.97 మీటర్లతో మూడో స్థానంలో నిలిచాడు. డైమండ్ లీగ్ ఫైనల్లో ఒలింపిక్ ఛాంపియన్ అర్షద్ నదీమ్, గతేడాది డైమండ్ ట్రోఫీ విజేత జాకుబ్ వడ్లెజ్లు పోటీలో పాల్గొనలేదు. నీరజ్ 86.82 మీటర్ల త్రోతో ఈవెంట్‌ను ప్రారంభించాడు. గ్రెనడాకు చెందిన పీటర్స్ మొదటి త్రో 87.87 మీటర్లు వేశాడు. నీరజ్ తన రెండవ త్రో (83.49 మీ)తో తన దూరాన్ని మెరుగుపర్చుకోలేకపోయాడు, కానీ మూడవ త్రో ను 87.86 మీటర్లు విసరాగలిగాడు. అయితే మొదటి స్థానానికి కేవలం ఒక్క సెంటీమీటర్ దూరంలో నిలిచాడు. అండర్సన్ పీటర్స్‌ను నీరజ్ అధిగమిస్తాడని భారత అభిమానులు అంచనా వేయగా, నీరజ్ తన నాలుగో ప్రయత్నంలో 82.04 మీటర్లు మాత్రమే విసిరాడు. భారత స్టార్ చివరి రెండు త్రోలలో మెరుగ్గా రాణించలేకపోయాడు, తన చివరి రెండు ప్రయత్నాలలో 83.30 మీటర్లు, 86.46 మీటర్లను మాత్రమే విసరాగలిగాడు.
Next Story