Mon Dec 23 2024 13:23:03 GMT+0000 (Coordinated Universal Time)
విండీస్ పై సెంచరీ బాదిన తెలుగబ్బాయి.. నెదర్లాండ్స్ సంచలనం
375 పరుగుల లక్ష్యంతో దిగిన నెదర్లాండ్స్ జట్టు 21.2 ఓవర్లలో 128 చేసి 3 వికెట్ కోల్పోగా.. ఈ దశలో తెలుగుతేజం తేజ నిడమనూరి
క్రికెట్ వన్డే ప్రపంచ కప్ 2023 క్వాలిఫైయర్ దశ ఉత్కంఠభరితమైన మ్యాచ్ లకు వేదికగా మారింది. పసికూన నెదర్లాండ్స్ వెస్టిండీస్‌కు షాకిచ్చింది. వెస్టిండీస్, నెదర్లాండ్స్ మధ్య జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్ లో మొదట భారీ స్కోరులు నమోదు కాగా.. చివరికి స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ ఫలితం తేలింది. నెదర్లాండ్ జట్టుకు ఆడుతున్న తెలుగు ఆటగాడు తేజ నిడమనూరు అద్భుతమైన సెంచరీతో కదంతొక్కడంతో విండీస్ కు ఊహించని షాక్ తగిలింది.
హరారే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 374 పరుగులు చేసింది. ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (76 పరుగులు, 81 బంతుల్లో, 13 ఫోర్లు), జాన్సన్ చార్లెస్ (54 పరుగులు, 55 బంతుల్లో, 9 ఫోర్లు, 1 సిక్స్) శుభారంభాన్ని ఇవ్వడం.. నికోలస్ పూరన్ సెంచరీ చేయడం విండీస్ భారీ స్కోరు కొట్టడానికి కారణమైంది. పూరన్ కేవలం 65 బంతుల్లో 104 పరుగులు (9 ఫోర్లు, 6 సిక్స్‌లు) చేయడంతో వెస్టిండీస్ జట్టుకు భారీ స్కోరు దక్కింది. కీమో పాల్ (46 పరుగులు, 25 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), షై హోప్ (47 పరుగులు, 38 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేశారు.
375 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు 21.2 ఓవర్లలో 128 చేసి 3 వికెట్ కోల్పోగా.. ఈ దశలో తెలుగుతేజం తేజ నిడమనూరి కేవలం 76 బంతుల్లో 111 రన్స్ (11 ఫోర్లు, 3 సిక్స్‌లు) చేశాడు. స్కాట్ ఎడ్వర్డ్స్ (67 పరుగులు, 47 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి ఆరో వికెట్‌కు 143 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో 28 ఏళ్ల తేజ వన్డేల్లో రెండో సెంచరీ నమోదు చేశాడు. చివరికి జట్టు స్కోరు 327 పరుగుల వద్ద 7వ వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. ఆఖర్లో కాస్త హైడ్రామా జరగ్గా మ్యాచ్ కాస్తా టైగా మిగిలింది. ఫలితం తేలాలంటే సూపర్ ఓవర్ అవసరం కాగా.. నెదర్లాండ్స్ విండీస్ కు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు.
సూపర్ ఓవర్లో నెదర్లాండ్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. వ్యాన్ బీక్, ఎడ్వర్డ్స్ బ్యాటింగ్‌కు దిగారు. హోల్డర్ వేసిన ఆ ఓవర్లో అన్ని బంతులనూ బౌండరీకి తరలించాడు (4, 6, 4, 6, 6, 4) వ్యాన్ బీక్. మొత్తం 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది నెదర్లాండ్స్ జట్టు. 31 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు తొలి బంతికి సిక్స్ రాబట్టింది. ఆ తర్వాత రెండు బంతులకు సింగిల్స్ రావడంతోనే విండీస్ ఓటమి కన్ఫర్మ్ అయింది. నాలుగో బంతికి చార్లెస్ ఔటయ్యాడు. ఐదో బంతికి షెపర్డ్ కూడా ఔటవ్వడంతో 8/2 పరుగులు చేసిన వెస్టిండీస్ జట్టు ఓటమిపాలైంది.
Next Story