Tue Dec 24 2024 00:18:58 GMT+0000 (Coordinated Universal Time)
టీ20 ప్రపంచకప్: న్యూజిలాండ్ చేతిలో చిత్తు చిత్తైన ఆస్ట్రేలియా
సూపర్-12 లో మొదటి మ్యాచ్ న్యూజిలాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆసక్తికరంగా సాగుతుందని భావించగా న్యూజిలాండ్ ఆస్ట్రేలియాను చిత్తు చిత్తు చేసింది. 89 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు వచ్చిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఓపెనర్ డేవాన్ కాన్వే (58 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 92 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ తో రెచ్చిపోయాడు. ఫిన్ అలెన్ (16 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 42) మెరుపులు మెరిపించాడు. ఈ ఇద్దరూ తొలి వికెట్ కు 56 పరుగులు జోడించారు. తర్వాత కెప్టెన్ కేన్ విలియమ్సన్ (23) సహకారంతో కాన్వే ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు.. రెండో వికెట్ కు విలియమ్సన్ తో కలిసి 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్ (12) తక్కువ స్కోర్లకే అవుటవ్వగా.. చివర్లో జిమ్మీ నీషమ్ (13 బంతుల్లో 3 సిక్సర్లతో 26 నాటౌట్) మెరుపులతో కివీస్ స్కోరు 200 మార్కు దాటించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హేజిల్ వుడ్ (2/41) రెండు వికెట్లు పడగొట్టగా.. ఆడమ్ జంపా (1/39) ఒక వికెట్ పడగొట్టాడు.
ఇక ఛేజింగ్ లో మ్యాక్స్ వెల్ మినహా ఎవరూ బ్యాట్ తో రాణించలేదు. 17.1 ఓవర్ల పాటూ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 111 పరుగులకు ఆలౌట్ అయింది. మొదటి ఓవర్ నుండి న్యూజిలాండ్ ఈ మ్యాచ్ లో పట్టు సాధించింది. వార్నర్ కేవలం 5 పరుగులకే అవుట్ అవ్వగా.. ఫించ్ 13, మార్ష్ 16 పరుగులు చేసి అవుట్ అయ్యారు. మ్యాక్స్ వెల్ 28 పరుగులతో రాణించగా.. కమిన్స్ 21 పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్లు వచ్చినట్లు వచ్చి.. వికెట్లు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. సౌథీ, శాంట్నర్ తలా మూడు వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాసించారు.
Next Story