Fri Nov 22 2024 20:53:30 GMT+0000 (Coordinated Universal Time)
పాకిస్థాన్ భారీ టార్గెట్ ఇచ్చినా.. కివీస్ కు తక్కువే!
హైదరాబాద్ వేదికగా పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్ లో పరుగుల వర్షం కురిసింది. పాకిస్థాన్ భారీ టార్గెట్ ఇవ్వగా.. న్యూజిలాండ్ కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని సొంతం చేసుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టులో మహ్మద్ రిజ్వాన్ సెంచరీ, కెప్టెన్ బాబర్ అజామ్, సాద్ షకీల్ అర్ధసెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 345 పరుగులు చేసింది. పాకిస్థాన్ 46 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయినప్పటికీ, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహ్మద్ రిజ్వాన్, కెప్టెన్ బాబర్ అజామ్ జోడీ ధాటిగా ఆడారు. రిజ్వాన్ 94 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 103 పరుగులు చేశాడు. బాబర్ అజామ్ 84 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 80 పరుగులు సాధించాడు. సాద్ షకీల్ దూకుడుగా ఆడడంతో పాక్ స్కోరు 300 మార్కు దాటింది. షకీల్ 53 బంతుల్లోనే 75 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. చివర్లో ఆఘా సల్మాన్ 23 బంతుల్లో 33 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఓపెనర్లు షఫీక్ (14), ఇమామ్ ఉల్ హక్ (1) విఫలమయ్యారు. న్యూజిలాండ్ జట్టులో మిచెల్ శాంట్నర్ 2, మాట్ హెన్రీ 1, జిమ్మీ నీషామ్ 1, లాకీ ఫెర్గుసన్ 1 వికెట్ తీశారు.
ఇక ఛేజింగ్ లో కివీస్ ఆరంభంలోనే ఓపెనర్ డెవాన్ కాన్వే వికెట్ కోల్పోయినా కూడా అలవోకగా లక్ష్యాన్ని చేరుకుంది. 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 43.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. రచిన్ రవీంద్రను కివీస్ ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా పంపింది. కేవలం 72 బంతుల్లోనే 97 పరుగులు చేశాడు. 3 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. రవీంద్ర స్కోరులో ఏకంగా 16 ఫోర్లు, ఓ సిక్సర్ ఉంది. కేన్ విలియమ్సన్ 54 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. ఆఖర్లో మార్క్ చాప్ మన్ 65 పరుగులతో.. నీషమ్ 33 పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లలో ఉస్మా మీర్ రెండు వికెట్లు తీశాడు.
Next Story