Fri Jan 10 2025 21:56:10 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీలంకకు మరో ఓటమి.. సెమీస్ ఆశలు గల్లంతు
ఆసియా కప్ ఛాంపియన్ శ్రీలంకకు సూపర్-12 లో మరో ఓటమి ఎదురైంది. న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక చిత్తు చిత్తుగా ఓటమిపాలైంది. శ్రీలంకపై న్యూజిలాండ్ సాలిడ్ విక్టరీని కొట్టేసి సెమీస్ బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకుంది. 168 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన శ్రీలంక 19.2 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ లెఫ్టార్మ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ 4 ఓవర్లలో 13 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. శాంట్నర్, ఇష్ సోధీ చెరో రెండు వికెట్లు తీయగా.. పేసర్లు టిమ్ సౌథీ, లాకీ ఫెర్గుసన్ చెరో వికెట్ తీశారు. లంక ఇన్నింగ్స్ లో కెప్టెన్ దసున్ షనక 35 పరుగులు చేయగా, భానుక రాజపక్స 34 పరుగులు సాధించాడు. వీరిద్దరు తప్ప లంక ఇన్నింగ్స్ లో మరెవ్వరూ రెండంకెల స్కోరు నమోదు చేయలేకపోయారు.
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసింది. ఓ దశలో 15 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ ను గ్లెన్ ఫిలిప్స్ ఆదుకున్నాడు. 64 బంతులాడిన ఫిలిప్స్ 10 ఫోర్లు, 4 సిక్సులతో 104 పరుగులు చేశాడు. లంక ఫీల్డర్లు పలుమార్లు క్యాచ్ లు వదిలేయడం ఫిలిప్స్ కు కలిసొచ్చింది. రెండుసార్లు లైఫ్ పొందిన ఫిలిప్స్ ఏకంగా సెంచరీ కొట్టాడు. కివీస్ ఇన్నింగ్స్ లో డారిల్ మిచెల్ 22 పరుగులు చేశాడు.
Next Story