Mon Dec 23 2024 10:20:35 GMT+0000 (Coordinated Universal Time)
Nithish Kumra Reddy : మెరిసిన నితీష్ రెడ్డి.. భారత్ ను ఆదుకున్న యువ క్రికెటర్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో భారత్ జట్టును తెలుగు కుర్రోడు నితీష్ కుమార్ రెడ్డి ఆదుకున్నాడు
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో భారత్ జట్టును తెలుగు కుర్రోడు నితీష్ కుమార్ రెడ్డి ఆదుకున్నాడు. సీనియర్ ఆటగాళ్లు అందరూ తక్కువ పరుగులకే అవుటయినా అరంగ్రేటంలోనే అదరగొట్టేశాడు. 41 పరుగులు చేసి భారత్ పరువు నిలబెట్టాడు. ఉదయం బ్యాటింగ్ కు దిగిన భారత్ జట్టు ఓపెనర్ల నుంచి అందరూ వెంటవెంటనే అవుటయ్యారు. సీనియర్ ఆటగాళ్లు సయితం పెద్దగా నిలబడ లేదు. పెర్త్ టెస్ట్ లో అతి విలువైన పరుగులు అందించి భారత్ బౌలర్లలో ఆత్మవిశ్వాసాన్నినింపాడు. నితీష్ కుమార్ రెడ్డి కారణంగానే భారత్ 150 పరుగులు చేయగలిగింది. చిన్న వయసులోనే అన్ని ఫార్మాట్లలో రాణిస్తూ భారత్ జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో మన నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడనే చెప్పాలి.
ఐపీఎల్ లో మెరిసి...
ఐపీఎల్ లో మెరిసిన ఈ తెలుగు కుర్రోడు అయిన నితీష్ కుమార్ రెడ్డి సెలెక్టర్ల దృష్టిలో పడ్డారు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరుపున నితీష్ ఆడి అందరి కళ్లలో పడ్డారు. అరంగేట్రం చేసినప్పటికీ ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ లో నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం దక్కలేదు. కేవలం స్టాండ్స్ కే పరిమితమయ్యాడు. అవకాశం కోసం కసిగా ఎదురు చూడటం తప్ప ఈ చిన్నోడు చేయగలిగిందేమీ లేదు కాబట్టి మిన్నకుండిపోయాడు. అయితే నాలుగో మ్యాచ్ లో అవకాశం లభించినప్పటికీ 14 పరుగులు చేయగలిగాడు. తర్వాత జరిగిన మ్యాచ్ లో తెలుగోడి సత్తాను క్రికెట్ ప్రపంచానికి చాటి చెప్పాడు. కేవలం 37 బాల్స్ లో 64 పరుగులు చేసిన నితీష్ కుమార్ రెడ్డి తనలో ఉన్న శక్తి ఇదీ అని నిరూపించుకోగలగాడు. పంజాబ్ కింగ్స్ మీద జరిగిన ఈ మ్యాచ్ తో నితీష్ కుమార్ రెడ్డి క్రికెట్ ఫ్యూచర్ ఒక్కసారిగా మారిపోయింది. ఎవరీ నితీష్ అని అందరూ చర్చించుకునేలా అందరి నోళ్లలో నానారు.
అన్ని ఫార్మాట్లలో...
విశాఖకు చెందిన ఈ నితీష్ కుమార్ రెడ్డికి ఊహించని అవకాశం లభించింది. టీం ఇండియా క్యాప్ లభించింది. బంగ్లాదేశ్ తో జరిగిన టీ 20లలో నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం దక్కడంతో ఇక వెనుదిరిగి చూడలేదు. రెండో టీ 20లో 74 పరుగులు చేసి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. దీంతోపాటు బౌలర్ గా కూడా నితీష్ కుమార్ రెడ్డికి పేరుంది. ఆ మ్యాచ్ లో రెండు వికెట్లు తీశాడు. నితీష్ కుమార్ రెడ్డి టీ 20లలో అవకాశం దక్కడంతో అదృష్టవశాత్తూ ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లోనూ అవకాశం అనుకోకుండా దక్కింది. రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతోనూ, గిల్ గాయంతో దూరం కావడంతో నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్ లభించింది. వచ్చిన అవకాశాన్ని మనోడు జార విడుచుకోలేదు. బ్యాట్ ఝుళిపించాడు. ఆస్ట్రేలియాపై అతి విలువైన పరుగులు చేసి టెస్ట్ మ్యాచ్ లోనూ తనకు తిరుగులేదని అనిపించుకున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి ఇప్పుడు అన్ని ఫార్మాట్లలో భారత్ కు దొరికిన ఒక ఆణిముత్యం అని చెప్పాలి. ఆల్ ది బెస్ట్ నితీష్ రెడ్డి.
Next Story