Wed Mar 26 2025 17:58:10 GMT+0000 (Coordinated Universal Time)
Champions Trophy : భారత్ బాగా ఆడిందా? ఆడలేదా? తెలుసుకోవాలనుందా?
బంగ్లాదేశ్ పైనే భారత్ ఇలా గెలిస్తే ఇక రానున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ పై గెలుపు ఎలా సాధ్యమన్న ప్రశ్నకు సమాధానం లేదు.

భారత్ బాగా ఆడిందని చెప్పాలా? లేక ఏమాత్రం మారలేదని చెప్పాలా? ఈ విషయంలో క్రీడా నిపుణులు సయితం ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. నిన్న భారత్ - బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ చూసిన వారికి ఎవరికైనా ఈ డౌట్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే గెలిచామన్న ఆనందం కన్నా, ఇంకా మెరుగుపడలేదన్న ఆందోళన మరింత అధికమయింది. బంగ్లాదేశ్ ను ఊదిపారేయాల్సిన జట్టు మనది అని జబ్బలు చరుచుకున్నాం. కానీ దుబాయ్ మైదానంలో ఏం జరిగింది? కేవలం విజయం మాత్రమే చూస్తున్నాం కానీ వైఫల్యాలను ఎందుకు చర్చించడలేదన్నది కూడా ముఖ్యమైన అంశమే. ఎందుకంటే బలహీనంగా భావించే బంగ్లాదేశ్ పైనే భారత్ ఆపసోపాలు పడి గెలిస్తే ఇక రానున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ పై గెలుపు ఎలా సాధ్యమన్న ప్రశ్నకు మాత్రం ఎవరి దగ్గర సమాధానం లేదు.
హండ్రెడ్ పర్సెంట్ లక్...
క్రికెట్ అంటే ఒక అదృష్టంగానే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గెలిస్తే మనోళ్లు కష్టపడి గెలిచినట్లు లేకపోతే మాత్రం దురదృష్టం వెంటాడిందని సర్దుకు చెప్పుకోవడం అలవాటుగా మారింది. బంగ్లాదేశ్ తో మనోళ్ల ఆట చూసిన తర్వాత రానున్న మ్యాచ్ ల ఆడే తీరుపై భయం పట్టుకుంది. ఎంత టెన్షన్ అంటే ఇప్పటికిప్పుడు టీం ను మార్చేయాలన్నంతగా. కానీ అది జరిగే పని కాదని తెలిసీ అలా ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. అక్షర్ పటేల్ హ్యాట్రిక్ వికెట్ ను మిస్ చేసిన రేవంత్ ను ఏమనాలి? కులదీప్ యాదవ్ బౌలింగ్ లో చేతికి అంది వచ్చిన బంతిని చేజార్చిన హార్థిక్ పాండ్యాను ఎంత వరకూ నిందించాలి? ఇవన్నీ పక్కన పెడితే విరాట్ కోహ్లి కూడా పెద్దగా ఇరగదీసింది కూడా లేదు.
పాక్ - న్యూజిలాండ్ మధ్య...
మొన్న జరిగిన పాక్ - న్యూజిలాండ్ మ్యాచ్ చూసిన వారికి ఇప్పుడు ఒకటి మాత్రం అర్థమవుతుంది. ఈ రెండు జట్లపై భారత్ గెలిస్తే మాత్రం అది ప్యూర్ గా లక్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే న్యూజిలాండ్ జట్టు పటిష్టంగా ఉంది. బౌలింగ్, బ్యాటింగ్ లో బలంగా ఉంది. పాకిస్థాన్ ఓటమి పాలయినా అది ఎప్పుడు కసితో ఆడుతుందో చెప్పలేం. బ్యాట్ లయ కుదిరిందంటే వారిని ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ భారత్ ఆటగాళ్లలో ఒకరికి కూడా ఈ లక్షణాలున్నాయా? అన్న ప్రశ్న తల్తెత్తుండటంతో ఫ్యాన్స్ లో కలవరం మొదలయింది. మినిమం ఇంత రన్స్ చేస్తారన్నభరోసా ఎవరిపైనా లేకపోయే. మరి ఈ టీంతో ఛాంపియన్ ట్రోఫీ సాధించడం సాధ్యమేనా? ఇలాంటి ప్రశ్నలకు ఆదివారం జరిగే పాక్ - భారత్ మ్యాచ్ సమాధానం చెప్పనుంది. చూడాలి. భారత్ ఆటగాళ్లు తమ తీరును మార్చుకుని, మైదానంలో ముఖ్యంగా ఫీల్డింగ్ లో మరింతగా రాణిస్తూ జట్టును విజయపథాన కోరుకోవడం తప్ప ఏం చేయగలం?
Next Story