Sat Nov 23 2024 05:44:29 GMT+0000 (Coordinated Universal Time)
టీ 20 వరల్డ్ కప్ ట్రోఫీ విజేతగా ఇంగ్లండ్
టీ 20 వరల్డ్ కప్ ట్రోఫీ విజేతగా ఇంగ్లండ్ జట్టు నిలిచింది. ఫైనల్లో పాకిస్థాన్ జట్టు మీద ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ హాఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మొయిన్ ఆలీ (13 బంతుల్లో 19 పరుగులు) అండగా నిలిచాడు. ఈ విజయంతో రెండోసారి టీ 20 ప్రపంచకప్ గెలిచిన జట్టుగా ఇంగ్లండ్ రికార్డు సృష్టించింది. 2010 లో ఇంగ్లండ్ పొట్టిప్రపంచకప్ విజేతగా నిలిచింది. వెస్టిండీస్ కూడా రెండు సార్లు టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే..!
138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మొదటి ఓవర్లోనే ఓపెనర్ హేల్స్ వికెట్ కోల్పోయింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు రాణించడంతో ఒక ఓవర్ మిగిలి ఉండగానే విజయం సాధించింది. పాకిస్థాన్ బౌలర్లలో హారిస్ రౌఫ్ రెండు వికెట్లు పడగొట్టాడు. షాదాబ్ ఖాన్, షాహీన్ ఆఫ్రీది, మొహమ్మద్ వాసీంలు తలా ఒక వికెట్ తీశారు. బెన్‌స్టోక్స్ అర్థసెంచరీతో చెలరేగి జట్టుని గెలిపించాడు. మొయిన్ ఆలీతో కలిసి ఇన్నింగ్స్‌ని నిర్మించాడు. బెన్ స్టోక్స్ 2019 వరల్డ్ కప్ ఫైనల్లో కూడా న్యూజిలాండ్ మీద కీలక ఇన్నింగ్స్ ఆడి హీరోగా నిలిచిన విషయం ఎవరూ మరిచిపోరు.
టీ 20 వరల్డ్ కప్ ఫైనల్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 20 ఓవర్లలో 137 పరుగులు చేసింది. ఓపెనర్ రిజ్వాన్ 15 పరుగులకే అవుట్ అయ్యాడు. కెప్టెన్ బాబర్ ఆజం (32 పరుగులు), మిడిల్ ఆర్డర్ బ్యాటర్ షాన్ మసూద్ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ ఇంగ్లండ్ బౌలర్లు ఎక్కడా కూడా పాక్ కు భారీ స్కోరు చేసే అవకాశం లేదు. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి పాకిస్థాన్ 137 పరుగులు చేసింది. షాన్ మసూద్ 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కర్రన్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్ చెరో రెండు వికెట్లు తీశారు. బెన్ స్టోక్స్‌కి ఒక వికెట్ దక్కింది. సామ్ కర్రన్ కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు దక్కాయి.
Next Story