Sun Mar 30 2025 13:50:53 GMT+0000 (Coordinated Universal Time)
Chamipions Trophy : సొంత గడ్డపై పాక్ కు చేదు అనుభవం.. కోలుకోలేని పాక్
ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ తడబడింది. న్యూజిలాండ్ పై భారీ పరుగుల తేడాతో ఓటమి పాలయింది

ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ తడబడింది. న్యూజిలాండ్ పై భారీ పరుగుల తేడాతో ఓటమి పాలయింది. కొన్నేళ్ల తర్వాత ఆతిధ్యమిస్తున్నామన్న ఆనందం ఈ ఓటమితో పాక్ లో ఆవిరయింది. ఇంత చిత్తుగా ఓడిపోతుందని బహుశా ఎవరూ ఊహించలేదు. బౌలింగ్, బ్యాటింగ్ లో ఘోర వైఫల్యాన్ని ప్రదర్శించింది. అరవై పరుగుల తేడాతో ఓటమి పాలయి తమ పరిస్థితి ఇంతేనని చెప్పకనే చెప్పింది. న్యూజిలాండ్ చెలరేగి ఆడింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లోన్యూజిలాండ్ ప్రదర్శించిన తీరు అబ్బుర పర్చింది. బ్యాటింగ్ లో లేథమ్, యంగ్ లు ఇద్దరూ సెంచరీలు చేయడంతో భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
రెండు సెంచరీలు...
బ్యాటింగ్ కు దిగిన కాన్వే అవుటయినా యంగ్ అలాగే నిలబడి సెంచరీ సాధించాడు. 107 పరుగులు చేసిన తర్వాత అవుటయ్యాడు. విలియమ్సన్స్ కూడా వెంటనే అవుట్ కావడంతో తర్వాత లేథమ్ వచ్చి సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం 118 పరుగులు చేశాడు. సిక్సర్లు, ఫోర్లతో మైదానాన్ని ఒక ఆటాడుకున్నాడు. తర్వాత ఫిలిప్స్ కూడా 61 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. 320 పరుగులు అంటే ఊదేదాద్దామనుకున్న పాక్ బ్యాటర్లను న్యూజిల్యాండ్ బౌలర్లు కట్టడి చేయగలిగారు. ఒరూర్క్ మూడు వికెట్లు తీసి మ్యాచ్ పై వత్తిడి పెంచాడు. తర్వాత శాటర్న్ కూడా తన బంతితో మాయ చేసి మూడు వికెట్లు తీసి పాక్ ఆటగాళ్లను పెవిలియన్ బాట పట్టించాడు. హెన్నీ రెండు వికెట్లు తీశాడు.
నిలబడలేక...
321 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ ఆదిలోనే వికెట్లు కోల్పోతూ తడబడింది. షకీల్ రెండు పరుగులకే అవుటయ్యాడు. రిజ్వాన్ ఆరు పరుగులు చేసి అవుటయ్యాడు. ఫకార్ ఉన్నాడులే అనుకుంటే ఇరవై నాలుగు పరుగులకే అవుటయ్యాడు. బాబర్ ఒక్కడే అరవై నాలుగు పరుగులు చేసి పరవాలేదని పించాడు. మిగిలిన ఆటగాళ్లలో సల్మాన్ కాసేపు బ్యాట్ తో ఆటాడుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వికెట్లు అందిపుచ్చుకున్న న్యూజిలాండ్ విజయం అప్పటికే ఖాయమయింది. ఇక వరస పెట్టి అవుటవుతూనే ఉన్నారు. చివరిలోకుష్ దిల్ షా కుదురుకోవడంతో కొంత ఊపు కనిపించినా అప్పటికే రన్ రేటు పెరిగింది. 60 పరుగులు చేసి ఒత్తిడితో వెనుదిరిగాడు. 47.2 ఓవర్లలోనే ఆల్ అవుట్ అయి పాక్ సొంత మైదానంలో విమర్శలు ఎదుర్కొంది.
Next Story