Sat Dec 21 2024 15:12:39 GMT+0000 (Coordinated Universal Time)
పాక్ కు వర్షం వరమయింది.. దక్షిణాఫ్రికాపై గెలుపు
దక్షిణాఫ్రికాపై పాకిస్థాన్ 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. డక్ వర్త్ లూయిస్ పద్థతిలో పాక్ ఈ విజయాన్ని నమోదు చేసుకుంది
ఈసారి వరల్డ్ కప్ లో సంచలనాలు నమోదవుతున్నాయి. ఏ జట్టు ఎవరి మీద గెలుస్తుందో అంచనా వేయడం కష్టంగానే కనిపిస్తుంది. పాకిస్థాన్ సెమీస్ లోకి ప్రవేశిస్తుందా? లేదా? అన్న అనుమానాలను ఈరోజు మ్యాచ్ కొంత తెరదించింది. పాక్ కు ఇంకా సెమీస్ అవకాశాలు కనిపిస్తున్నాయి. దక్షిణాఫ్రికాపై పాకిస్థాన్ 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. డక్ వర్త్ లూయిస్ పద్థతి ప్రకారం పాక్ ఈ విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో పాకిస్థాన్ నాలుగు పాయింట్లతో మూడో స్థానానికి చేరింది. వర్షమే పాకిస్థాన్ కు వరంగా మారింది.
డక్ వర్త్ లూయీస్ పద్ధతిలో...
తొలుత బ్యాటింంగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 185 భారీ స్కోరు సాధించింది. అయితే దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కు దిగిన తర్వాత 9 ఓవర్లకు 69 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం పడింది. వర్షం తగ్గిన తర్వాత డక్ వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం 14 ఓవర్లలో దక్షిణాఫ్రికా 142 పరుగులు చేయాలని నిర్ణయించారు. కానీ చివరి ఓవర్ లో 41 పరుగులు చేయాల్సి ఉండటంతో అది సాధించలేకపోయింది. దీంతో పాక్ దే విజయంగా మారింది. ప్రస్తుతం భారత్ ఆరు పాయింట్లతో టాప్ లోనూ, ఐదు పాయింట్లతో దక్షిణాఫ్రికా తర్వాత, నాలుగు పాయింట్లతో పాకిస్థాన్ మూడో స్థానంలో ఉంది. మరి చివరకు సెమీస్ కు చేరే జట్లు ఏవి అంటే చెప్పడం కష్టంగానే ఉంది.
Next Story