Sat Nov 23 2024 13:03:01 GMT+0000 (Coordinated Universal Time)
హనుమ విహారిపై సంచలన ఆరోపణలు చేసిన నరసింహాచారి
తన కుమారుడు పృథ్వీ ఆంధ్రా రంజీ టీమ్ కు సెలెక్ట్ అయినా.. ఒక్క మ్యాచ్ లో కూడా ఆడించలేదని
ఆంధ్రా రంజీ టీమ్ కెప్టెన్సీ వదులుకోవడానికి కారణం ఓ రాజకీయ నేత అని టీమిండియా క్రికెటర్ హనుమ విహారి ఆరోపించడం ఏపీ రాజకీయాల్లో సంచలనమైంది. ఓ యువ ఆటగాడిపై తాను కోప్పడ్డానని, దాంతో అతడి తండ్రి ఆంధ్రా క్రికెట్ సంఘానికి ఫిర్యాదు చేయడంతో, తనను కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని ఒత్తిడి చేశారని విహారి తెలిపాడు. ఈ విషయంలో అధికార వైసీపీని టార్గెట్ చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు. అయితే యువ క్రికెటర్ పృథ్వీరాజ్ తండ్రి, తిరుపతి వైసీపీ కార్పొరేటర్ కుంట్రపాకం నరసింహాచారి స్పందించారు.
నరసింహాచారి మాట్లాడుతూ.. తన కుమారుడు పృథ్వీ ఆంధ్రా రంజీ టీమ్ కు సెలెక్ట్ అయినా.. ఒక్క మ్యాచ్ లో కూడా ఆడించలేదని అన్నారు. నేను రాజకీయ పలుకుబడి ఉన్న వాన్నే అయితే నా కుమారుడు కనీసం ఒక్క మ్యాచ్ లో అయినా ఆడాలి కదా అని అన్నారు. కనీసం తనకుమారుడు మొదటి 14 మందిలో కూడా లేదని అన్నారు. ఎనిమది మ్యాచ్ లు జరిగాయని.. నాకే అంత పొలిటికల్ పవర్ ఉంటే మా వాడు ఎనిమిది మ్యాచ్ ల్లో ఆడేవాడు కదా అని ప్రశ్నించారాయన. మొదటి రోజు జరిగిన సంఘటనను మనసులో పెట్టుకుని హనుమ విహారి ఇదంతా చేశాడు. ఇండియాకు ఆడాడు.. ఎంత పరిణితి ఉండాలి? ఎంతటి సానుకూల దృక్పథం ఉండాలి? అసలు జరిగింది చెబితే, క్రికెట్ ప్రేమికులు గానీ, ఆంధ్రరాష్ట్ర ప్రజలు కానీ దిగ్భ్రాంతికి గురవుతారన్నారు. అతడిని సమర్థిస్తున్న సో కాల్డ్ నాయకులంతా వారి ముఖంపై వారే ఉమ్మేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. 23 ఏళ్ల కుర్రాడు ఫోన్ లో ఒకటే పనిగా ఏడుస్తూ ఉంటే ఒక తండ్రిగా నేను ఏం చేయాలో అదే చేశాను. పద్ధతి ప్రకారమే ఆంధ్రా క్రికెట్ సంఘానికి ఫిర్యాదు చేశాను. నేను కూడా క్రీడాకారుడ్నే, ఆ విధంగానే ముందుకు పోయానన్నారు. మా అబ్బాయిని తిట్టాడు, కొట్టడానికి వచ్చాడనే ఫిర్యాదు చేశాను తప్ప ఇతర విషయాల జోలికి పోలేదన్నారు.
Next Story