Tue Dec 24 2024 12:57:38 GMT+0000 (Coordinated Universal Time)
సెలెక్టర్లపై కోపాన్ని ఇలా చూపిస్తున్న పృథ్వీ షా
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అస్సాంతో జరిగిన మ్యాచ్లో ముంబై తరఫున ఆడుతున్న సమయంలో కుడిచేతి వాటం బ్యాటర్ పృథ్వీ షా సెంచరీతో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. అతను 61 బంతుల్లో 134 పరుగులు సాధించాడు. షా 46 బంతుల్లో తన సెంచరీని సాధించాడు. అతని ఇన్నింగ్స్లో 13 ఫోర్లు మరియు 9 సిక్సర్లు ఉన్నాయి, అతని స్ట్రైక్ రేట్ 220కి దగ్గరగా ఉంది. షాకు ఇది తొలి T20 సెంచరీ కావడంతో అభిమానులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. పలు కారణాలను చూపిస్తూ షా కు భారత జట్టులో చోటు ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అతడి బ్యాటింగ్ ను చూసి మీరు ఏమి చెబుతారంటూ అభిమానులు ప్రశ్నిస్తూ ఉన్నారు.
ఎంతో ట్యాలెంట్ ఉన్న ఆటగాడు పృథ్వీ షా. అయితే పేలవ ఫిట్నెస్, ఫామ్ కారణంగా టీమ్కి క్రమంగా దూరమైపోయాడు. ఇప్పుడు ఏ ఫార్మాట్లోనూ అతనికి భారత సెలెక్టర్లు అవకాశం ఇవ్వడం లేదు. దాంతో ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో ఆడుతున్న పృథ్వీ షా.. ఫిట్నెస్ విషయంలోనూ శ్రద్ధ పెట్టాడు. ఐపీఎల్ 2022 ముగిసిన తర్వాత అతను దాదాపు 7-8 కేజీలు బరువు తగ్గాడు. ఇటీవల రంజీ ట్రోఫీలో ముంబయి తరఫున నిలకడగా రాణించిన పృథ్వీ షా.. న్యూజిలాండ్-ఎ జట్టుతో జరిగిన సిరీస్లోనూ భారత్ -ఎ జట్టు తరఫున సత్తాచాటాడు. ఇప్పుడు ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా పృథ్వీ షా మంచి స్కోర్లు సాధిస్తూ ఉన్నాడు. ఇటీవల తనను జట్టులోకి తీసుకోకపోవడంపై స్పందించాడు. దేశవాళీ క్రికెట్లో బాగానే రన్స్ చేస్తున్నా. కానీ.. నాకు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో అవకాశం ఇవ్వకపోడం చాలా నిరాశపరిచింది. భారత సెలెక్టర్లు నేను ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని ఎప్పుడు భావిస్తారో .. అప్పుడు నన్ను ఆడిస్తారు. నేను కూడా ఎప్పుడు ఛాన్స్ దక్కినా.. అది భారత్ జట్టు లేదా భారత-ఎ జట్టు లేదా ఏ టీమ్ అయినా సత్తాచాటేందుకు ప్రయత్నిస్తా. ఈ మేరకు ఇప్పటికే ఫిట్నెస్పై శద్ధ పెట్టానని తెలిపాడు షా.
Next Story