Sun Nov 17 2024 18:24:16 GMT+0000 (Coordinated Universal Time)
యస్.. ఇట్స్ అఫీషియల్
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పొడిగించింది. వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ కు కూడా ద్రావిడ్ కోచ్ గా కొనసాగనున్నారు. కోచ్ గా ద్రావిడ్ పదవీకాలం వరల్డ్ కప్ తో ముగిసింది. పలు సంప్రదింపుల అనంతరం కోచ్ గా కొనసాగేందుకు ద్రావిడ్ అంగీకరించడంతో బీసీసీఐ అధికారికంగా ప్రకటన చేసింది. టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ కొనసాగుతాడని, ఇతర సహాయక సిబ్బంది కాంట్రాక్టును కూడా పొడిగిస్తున్నామని బోర్డు వెల్లడించింది.
రాహుల్ ద్రావిడ్ విజన్, ప్రొఫెషనలిజమ్ పై బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ ప్రశంసలు కురిపించారు. ద్రావిడ్ సవాళ్లకు ఎదురొడ్డి నిలిచి భారత క్రికెట్ జట్టును తీర్చిదిద్దాడన్నారు. హెడ్ కోచ్ గా కొనసాగేందుకు ద్రావిడ్ అంగీకరించడం పట్ల ఎంతో సంతోషిస్తున్నామన్నారు. ద్రావిడ్ కోచ్ గా టీమిండియా విజయ ప్రస్థానం కొనసాగుతుందనడంలో తనకెలాంటి సందేహం లేదని అన్నారు. టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ కంటే మెరుగైన వ్యక్తి మరొకరు లేరని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. ప్రతిభ పరంగానూ, నిబద్ధత పరంగానూ కోచ్ గా ద్రావిడ్ తనను తాను నిరూపించుకున్నారన్నారు. టీమిండియా అన్ని ఫార్మాట్లలో శక్తిమంతమైన జట్టుగా రూపొందిందని, మూడు ఫార్మాట్ల ర్యాంకింగ్స్ లో మన జట్టుకు అగ్రస్థానం ద్రావిడ్ విజన్ కు ప్రత్యక్ష నిదర్శనం అని ప్రశంసలు గుప్పించారు. రాహుల్‌తోపాటు ఇప్పటికే ఉన్న సహాయక సిబ్బంది పదవీకాలాన్ని కూడా బీసీసీఐ పొడిగించింది. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ సేవలను పొడిగించారు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్, 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న నేపథ్యంలో కోచింగ్ సిబ్బందిని మార్చడం కూడా పెద్ద రిస్క్. వన్డే ప్రపంచ కప్ లో భారత్ అద్భుతంగా రాణించింది.. ఫైనల్ లో అదృష్టం కలిసి రాలేదంతే!!
టీమ్ఇండియాతో గత రెండేళ్ల ప్రయాణం ఎన్నో జ్ఞాపకాలను అందించిందని.. మేనేజ్‌మెంట్‌తోపాటు జట్టు నుంచి ఎంతో సహకారం లభించిందన్నారు ద్రావిడ్. డ్రెస్సింగ్ రూంలో సృష్టించిన వాతావరణం పట్ల గర్వంగా ఉన్నామని.. జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. మేం సరైన దారిలోనే ఉన్నాం. మా సన్నద్ధతపై స్పష్టత ఉంది. నాపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన బీసీసీఐకి ధన్యవాదాలని ద్రవిడ్ తెలిపారు.
Next Story