Fri Dec 20 2024 17:03:48 GMT+0000 (Coordinated Universal Time)
బెంగళూరుకు మరో సారి నిరాశే..!
బెంగళూరుతో గత రాత్రి జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది.
ఫైనల్ కు చేరాలి.. కప్ కొట్టాలి అని అనుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మరోసారి నిరాశ ఎదురైంది. బెంగళూరుతో గత రాత్రి జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. రాజస్థాన్ ఎదుట కేవలం 158 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు ఉంచగా.. బట్లర్ బాదుడు మొదలవ్వడంతో పవర్ ప్లే లోనే ఆర్సీబీ ఆశలు ఆవిరయ్యాయి. ఆర్ఆర్ ఓపెనర్ జోస్ బట్లర్ 60 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, 6 సిక్సర్లతో శతకం (106, నాటౌట్) నమోదు చేశాడు. ఈ సీజన్లో బట్లర్‌కు ఇది నాలుగో సెంచరీ కాగా, ఐపీఎల్లో ఐదోది. యశస్వి జైస్వాల్ 21, కెప్టెన్ సంజు శాంసన్ 23 పరుగులు చేయడంతో మరో 11 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది రాజస్థాన్. బెంగళూరు బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్‌కు 2 వికెట్లు దక్కాయి.
తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు అనుకున్నదానికంటే 30 పరుగులు తక్కువ చేసింది. ఫైనల్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోహ్లీ (7), డుప్లెసిస్ (25), మ్యాక్స్‌వెల్ (24) పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. రజత్ పటీదార్ మాత్రం జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. 42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 58 పరుగులు చేయడంతో బెంగళూరు ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. షాబాజ్ అహ్మద్ (12) పర్వాలేదనిపించగా.. ఫినిష్ చేస్తాడని అనుకున్న దినేశ్ కార్తీక్ (6) ఘోరంగా విఫలమవ్వడంతో బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాజస్థాన్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, ఒబెడ్ మెక్‌కాయ్‌లకు చెరో మూడు వికెట్లు దక్కాయి. రాజస్థాన్ ఓపెనర్ బట్లర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. రాజస్థాన్ రాయల్స్ ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో టైటిల్ పోరులో తలపడుతుంది.
Next Story